జిల్లా కేంద్రం ఇచ్చాం కదా? :‘మీకు జిల్లా కేంద్రం ఇచ్చాం కదా? మళ్లీ మంత్రి పదవి కూడా ఇస్తే మీపై ఇతరులకు ఈర్ష్య పెరుగుతుంది. దానివల్ల వచ్చే ఎన్నికల్లో మీకే ఇబ్బంది రావచ్చు’ అని కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం అన్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోన రఘుపతి, గ్రంధి శ్రీనివాస్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి వారితో ముఖ్యమంత్రి ఇలా అన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరికొందరితోనూ జిల్లా కేంద్రం అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇలాగైతే ఎలా? :‘మీరు తెదేపాపై గట్టిగా మాట్లాడటం లేదు, వారు(తెదేపా) ప్రభుత్వంపై, మనపై విమర్శలు చేసినప్పుడు మీరు గట్టిగా ప్రతిస్పందించాలి కదా? వారిపై ప్రతివిమర్శలు చేయడం లేదెందుకు? ఇలాగైతే మంత్రిమండలిలోకి వచ్చినపుడు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయలేకపోవచ్చు కదా’ అని మరికొందరు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అన్నట్లు విశ్వసనీయ సమాచారం. తెదేపాను విమర్శించనివారికి పదవి ఇవ్వకపోతే... కొత్త మంత్రుల్లో ఒక మహిళతో పాటు మరికొందరు తెదేపాను ఎప్పుడు తిట్టారని అంతర్గతంగా నేతల్లో చర్చ జరుగుతోంది. ఒకరిద్దరికి మాత్రం ముఖ్యమంత్రి స్పష్టమైన భరోసా ఇచ్చారన్న ప్రచారం ఉంది. మిగిలిన వారిలో ఎక్కువమందికి సామాజిక, రాజకీయ సమీకరణలు కుదరకపోవడం వల్ల పదవి ఇవ్వలేకపోయామని చెప్పినట్లు తెలిసింది.