ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో... ఆర్థిక, రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా, అబ్కారీ, అటవీశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం... ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు వచ్చిన ఆదాయాలతో పోలిస్తే... ఈ ఏడాది ఎక్కువ శాతం విభాగాల్లో ఆదాయం తగ్గిందని తెలిపారు. కొన్ని శాఖల్లో మాత్రమే గతేడాది కంటే ఆదాయం ఎక్కువగా వచ్చిందని వివరించారు. అన్ని శాఖల నుంచి గతేడాది అక్టోబర్ వరకు రూ.35 వేల 411 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అదే సమయానికి రూ.34 వేల 669 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తంమీద 2.10 శాతం అంటే రూ.741 కోట్ల మేర ఆదాయం తగ్గిందని తేల్చారు.
ఆదాయం తగ్గుదల ఎక్సైజ్ శాఖలో అతి ఎక్కువగా నమోదైంది. ఈ శాఖలో రూ.360 కోట్లు కోతపడింది. రవాణా శాఖలో144, గనులు, భూగర్భ వనరుల శాఖలో 235, రెవెన్యూ శాఖలో 25, అటవీ శాఖలో రూ.102 కోట్ల చొప్పున ఆదాయం తగ్గింది. కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రూ.91 కోట్లు, వాణిజ్య పన్నుల్లో రూ.35 కోట్లు చొప్పున ఆదాయం పెరిగింది.