వరదలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరద నష్టం వివరాలను మంత్రులు, అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కృష్ణా వరదల వల్ల వేమూరు నియోజకవర్గం బాగా దెబ్బతిందని మంత్రి కన్నబాబు సీఎంకు వివరించారు. అవనిగడ్డ, పామర్రు, పెనమలూరులో పంటలు దెబ్బతిన్నాయన్న కన్నబాబు... మరికొన్ని ప్రాంతాల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయని ముఖ్యమంత్రికి తెలిపారు. విజయవాడలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు.
బ్యాంకులు మినహాయించుకోకుండా..రైతులఇన్‌పుట్ సబ్సిడీలను అన్‌ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో వేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వివిధ పంటలకు ఇస్తున్న పరిహారాన్ని 15 శాతం పెంచాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా భూసార పరీక్షలు చేయాలన్న సీఎం... విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కౌలురైతుల చట్టంపై అవగాహన కల్పించాలన్న జగన్... వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని... నాలుగైదు నెలల్లో అన్నీ కార్యరూపం దాల్చాలని ఆదేశించారు.
రూ.95 కోట్ల విలువైన పంటనష్టం...
వరదల కారణంగా 22 వేల హెక్టార్లలో రూ.95 కోట్ల విలువైన పంటనష్టం జరిగిందని మంత్రి కన్నబాబు వివరించారు. వరదల వల్ల 90 మండలాలు, 484 గ్రామాలు ప్రభావితం అయ్యాయన్న ఆయన.. ఇన్‌పుట్ సబ్సిడీ 15 శాతం పెంచి ఇవ్వాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. వాణిజ్య పంటలు బీమా పరిధిలోకి రావడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని కన్నబాబు చెప్పారు. మినుము, పెసలపై తొలిసారిగా వందశాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
పరిహారం ప్రత్యేక ఖాతాలో వేసి... రైతు చేతికి అందాలని నిర్ణయించినట్లు చెప్పారు. రైతు పెట్టుబడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరినట్లు వివరించారు. నాణ్యమైన విత్తనాలు, పురుగుమందుల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంటామన్న కన్నబాబు... రైతుల కోసం కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. సేవలు అందించేలా కాల్‌సెంటర్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. రైతు సేవల కోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. కల్తీలపై కఠినచర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు కన్నబాబు చెప్పారు.
ఇదీ చదవండీ...రాజధాని భూముల్లో అనేక అక్రమాలున్నాయి: బొత్స