ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోజు మార్చి రోజు తరగతులు: సీఎం జగన్

రాష్ట్రంలో 8వ తరగతి వరకు పిల్లలకు రోజు విడిచి రోజు తరగతులుంటాయి. నవంబరు 2 నుంచి పాఠశాలలు తెరిచిన తర్వాత ఇలా రోజు విడిచి రోజు, అదీ మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు.

cm jagan review meeting on reopening of schools in state
రోజు మార్చి రోజు తరగతులు: సీఎం జగన్

By

Published : Oct 21, 2020, 9:12 AM IST

రాష్ట్రంలో 8వ తరగతి వరకు పిల్లలకు రోజు విడిచి రోజు తరగతులుంటాయి. నవంబరు 2 నుంచి పాఠశాలలు తెరిచిన తర్వాత ఇలా రోజు విడిచి రోజు, అదీ మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ‘1, 3, 5, 7 తరగతులకు ఒక రోజు, 2, 4, 6, 8 తరగతులకు మర్నాడు.. ఇలా పాఠశాల నిర్వహించాలి. 9, 10 తరగతుల వారికి రోజూ తరగతులుంటాయి. మధ్యాహ్నం తరగతులు ముగిశాక భోజనం పెట్టి పిల్లలను పంపాలి.

విద్యార్థుల సంఖ్య 750 దాటితే మూడు రోజులకోసారి చొప్పున తరగతులు జరుగుతాయి. నవంబరు నెలంతా ఇదే అమలవుతుంది. పరిస్థితికి అనుగుణంగా డిసెంబరులో నిర్ణయం తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోతే.. వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి’ అని సీఎం సూచించారు. రైతుభరోసా రెండో విడత సొమ్ము ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. అటవీభూములకు పట్టాలున్న(ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) రైతులకూ రూ.11,500 చొప్పున ఇవ్వబోతున్నారు. ఖరీఫ్‌ పెట్టుబడి రాయితీనీ అదేరోజు చెల్లిస్తారు. ఈ ఏడాది జూన్‌, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు రూ.113 కోట్లు, ఉద్యానపంటలకు రూ.32 కోట్ల మొత్తాన్ని విడుదల చేయబోతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. ఒక పంటకాలం పెట్టుబడి రాయితీని అదే పంటకాలంలో ఇస్తున్నామని చెప్పారు. ‘వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ముంపు బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామోలిన్‌ నూనె, కిలో ఉల్లి, కిలో ఆలుగడ్డలు పంపిణీ చేయాలి. సహాయ శిబిరాల్లోని వారిని వెనక్కి పంపేటప్పుడు రూ.500 వారి చేతిలో పెట్టండి. భారీవర్షాలతో చనిపోయిన 19 మందిలో 14 మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు, మిగిలిన అయిదుగురికీ ఇవ్వండి’ అని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details