ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN DAVOS TOUR: దావోస్‌ వెళ్లీ.. అవే కంపెనీలు..! - CM JAGAN DAVOS TOUR UPDATES

* అధికారంలోకి రాగానే... గత ప్రభుత్వ హయాంలో జరిగిన సౌర, పవన విద్యుత్‌ ఒప్పందాల్లో అనేక లోటుపాట్లు జరిగాయని, వాటన్నింటినీ సమీక్షిస్తామని హడావుడి చేసిన జగన్‌... ఇప్పుడు ప్రధానంగా విద్యుత్‌ రంగంలో ఒప్పందాలు చేసుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. తాజాగా దావోస్‌లో చేసుకున్న ఒప్పందాలూ అవే. * దావోస్‌లో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న మూడు సంస్థలూ.. అదానీ, గ్రీన్‌కో, అరబిందో అధికారపక్షానికి అనుకూలంగా ఉంటున్న వారివే. వీటిలో అరబిందో సంస్థ ఏకంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడిదే! ఇక నాలుగోది ఆర్సెలర్‌ మిత్తల్‌ సంస్థ. దాంతో కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పటికే విశాఖలో ఉన్నదానికి విస్తరణే గానీ కొత్తది కాదు. * రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల్ని అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థలకు వివరించి, ఒప్పించేందుకు, రాష్ట్రానికంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సృష్టించేందుకు దావోస్‌ సదస్సు అద్భుత అవకాశం. తాజా సదస్సులో ఏపీతో ఒక్క విదేశీ కంపెనీ కూడా పెట్టుబడుల ఒప్పందం చేసుకోలేదంటే... మనం ఆ దిశగా గట్టి కసరత్తు చేయలేదనే అర్థమవుతోంది!

CM JAGAN DAVOS TOUR: దావోస్‌ వెళ్లీ.. అవే కంపెనీలు..!
CM JAGAN DAVOS TOUR: దావోస్‌ వెళ్లీ.. అవే కంపెనీలు..!

By

Published : Jun 1, 2022, 4:54 AM IST

ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనలో హరిత ఇంధన (గ్రీన్‌ ఎనర్జీ) రంగంలో గ్రీన్‌కో, అరబిందో రియల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీస్‌ సంస్థలతో రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంత దూరం వెళ్లి ఆ మూడు సంస్థలతో విద్యుత్‌ రంగంలో ఒప్పందాలు చేసుకోవడంవల్ల రాష్ట్రానికి ఒరిగేదేంటి? వాటిలో రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేందుకు పటిష్ఠమైన నిబంధనలు పెట్టారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న సమగ్ర పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవలే ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూముల్ని ఎకరం రూ.5 లక్షలకు ఇచ్చింది. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్‌ ప్రాజెక్టుకు (పీఎస్‌పీ) గోరకల్లు రిజర్వాయరు నుంచి 2.35 టీఎంసీల నీటిని కేటాయించింది. ఆ నీటితో గ్రీన్‌కో సంస్థ 1,680 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టును నిర్వహిస్తుంది. అక్కడ వచ్చిన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు నీరు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టులో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 12% ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన ఉంది. గ్రీన్‌కో ప్రాజెక్టుకు మన ప్రభుత్వం అలాంటి నిబంధన పెడితే.. పాతికేళ్లలో రూ.3,311 కోట్ల లబ్ధి చేకూరేదని విద్యుత్తురంగ నిపుణుల అంచనా. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. ఉత్పత్తి చేసిన విద్యుత్తులో కొంత మొత్తాన్ని తక్కువ ధరకు రాష్ట్రానికి కేటాయించాలన్న నిబంధనైనా పెట్టలేదు. ఆ ప్రాజెక్టు ఒప్పందం గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఒప్పందంలో అలాంటి నిబంధనల్ని గత ప్రభుత్వం పెట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా పాత ఒప్పందాన్నే కొనసాగించింది తప్ప, నిబంధనలు మార్చలేదు. ఆ ప్రాజెక్టు ఏర్పాటుతో కొందరికి ఉపాధి లభించడం తప్ప, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు. 12% విద్యుత్‌ ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన పెడితే ఒక్క కర్నూలు ప్రాజెక్టుతోనే పాతికేళ్లలో రూ.3,311 కోట్లు వస్తాయంటే.. దావోస్‌లో మూడు సంస్థలతో చేసుకున్న రూ.1.25 లక్షల కోట్ల విద్యుత్‌ ఒప్పందాల్లో అలాంటి నిబంధన పెడితే ఇంకెంత లబ్ధి చేకూరేదో అన్న వాదన వినిపిస్తోంది.

మళ్లీ విద్యుత్‌ రంగంపైనే ఒప్పందాలు
‘అభివృద్ధి, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి దావోస్‌ వేదికగా సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్రం చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దావోస్‌ వేదికను రాష్ట్రం వినియోగించుకుంది. విఖ్యాత కంపెనీలు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు’ అని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వారు చెప్పిన విఖ్యాత కంపెనీలు అదానీ, గ్రీన్‌కో, అరబిందోనే కావడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సౌర, పవన విద్యుత్‌ ఒప్పందాల్లో అనేక లోటుపాట్లు జరిగాయని, వాటన్నింటినీ సమీక్షిస్తామని అధికారంలోకి రాగానే హడావుడి చేసిన జగన్‌... ఇప్పుడు ప్రధానంగా విద్యుత్‌ రంగంలో ఒప్పందాలు చేసుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. చివరకు దావోస్‌లో చేసుకున్న ఒప్పందాలూ అవే. అదానీ సంస్థతో రూ.60వేల కోట్లతో 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌, 3,700 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు, గ్రీన్‌కో సంస్థతో రూ.37వేల కోట్లతో 8వేల మెగావాట్ల హరిత విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు, అరబిందో రియల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థతో రూ.28వేల కోట్లతో 6 వేల మెగావాట్ల హరిత విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. గ్రీన్‌కో సంస్థ ఆర్సెలర్‌ మిత్తల్‌తో కలసి ఆ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌ లిమిటెడ్‌తో రూ.1000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి మరో ఒప్పందం చేసుకున్నా, అది కొత్త ప్రాజెక్టేమీ కాదు. విశాఖలోని తమ ప్లాంటు విస్తరణకు ఆ సంస్థ ఆ డబ్బు ఖర్చు చేయనుంది. ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం, దస్సాల్ట్‌ సిస్టమ్స్‌, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌, బైజూస్‌, కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ వంటి సంస్థలతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నా, అవి పెట్టుబడులకు సంబంధించినవి కావు, కొన్ని రంగాల్లో సహకారానికి సంబంధించినవే.

ఆ మూడూ అనుకూలురవే...
దావోస్‌లో ఏపీ ప్రభుత్వం హరిత ఇంధన రంగంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న మూడు సంస్థలూ అధికార పక్షానికి అనుకూలంగా ఉంటున్న వారివే. అదానీ ఉత్తర భారత సంస్థ అయినా.. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ఏపీ కేంద్రంగా కార్యక్రమాలు ముమ్మరం చేసింది. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాకు జెన్‌కో 3 సార్లు టెండర్లు పిలవగా అదానీ సంస్థ నుంచే బిడ్లు వచ్చాయి. (చివరి విడత టెండర్లలో చెన్నైకి చెందిన ఓ సంస్థ ఒక టెండరు వేసింది) గతంలో బొగ్గు సరఫరా చేసిన సంస్థలేవీ బిడ్లు దాఖలు చేయకపోవడం రాష్ట్రంపై అదానీ ప్రభావానికి నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు ఇప్పటికే అదానీ చేతిలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం ఏటా 7వేల మెగావాట్ల చొప్పున 25ఏళ్ల పాటు విద్యుత్‌ కొనేందుకు భారత సౌర విద్యుత్‌ సంస్థ (సెకి)తో కుదుర్చుకున్న ఒప్పందంలో రెండొంతుల విద్యుత్‌ అదానీ సంస్థే సరఫరా చేయనుంది. విశాఖలో రూ.70వేల కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో అదానీ ఒప్పందం చేసుకుంది. వైకాపా అధికారంలోకి వచ్చాక... కొన్ని నెలలపాటు ఆ ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టింది. నిర్దిష్ట వ్యవధిలో పెట్టే పెట్టుబడులకే భూములిస్తామని చెప్పింది. రూ.13వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా, విశాఖలో 130 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందాన్ని కుదించింది. తర్వాత అదానీకి ప్రాధాన్యం విపరీతంగా పెరిగింది. డేటా సెంటర్‌కు భూముల కేటాయింపులో పలు రాయితీలు ఇచ్చింది.

* గ్రీన్‌కో సంస్థ సీఈవో చలమలశెట్టి అనిల్‌ సోదరుడు సునీల్‌ గత ఎన్నికల్లో తెదేపా తరఫున కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పీపీఏల సమీక్ష పేరుతో హడావుడి చేసిన వాటిలో గ్రీన్‌కో సంస్థతో చేసుకున్న ఒప్పందం ఉంది. తర్వాత సునీల్‌ అధికార పార్టీకి సన్నిహితంగా మెలగడంతో గ్రీన్‌కోపై ప్రభుత్వ వైఖరి మారింది. ఇటీవల కర్నూలు జిల్లాలో ఆ సంస్థ రూ.15వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న సమగ్ర పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని సీఎం ప్రారంభించారు.

* అరబిందో సంస్థ విజయసాయిరెడ్డి వియ్యంకుడిది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాకినాడ పోర్టు, కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములు ఆ సంస్థ చేతుల్లోకి వెళ్లాయి.

కొన్ని నెలల ముందు నుంచే కసరత్తు జరగాలి
వివిధ దేశాల అధినేతలు, మంత్రులతో పాటు, ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల ఛైర్మన్లు, ఎండీలు, సీఈవోలు, ముఖ్య ప్రతినిధులు పాల్గొనే వేదిక వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం. అలాంటి ప్రముఖులందర్నీ కలిసేందుకు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వారికి వివరించేందుకు, వారిని ఒప్పించి పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకునేందుకు, రాష్ట్రానికి ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సృష్టించేందుకు, వివిధ కంపెనీలతో నెట్‌వర్కింగ్‌కు దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సు అద్భుతమైన అవకాశం. అక్కడ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే... రాష్ట్రానికి ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ వస్తుంది. దీర్ఘకాలంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు వీలు కలుగుతుంది. విదేశీ కంపెనీల్ని ఆకర్షించాలంటే... మనకున్న బలాలు, ఇక్కడున్న అవకాశాలు, రాష్ట్రానికి వస్తే వారికి ఇచ్చే రాయితీలను సమర్థంగా వివరించగలగాలి. రాష్ట్ర బృందానికి సారథ్యం వహించే ముఖ్యమంత్రి, మంత్రి అక్కడ సీఈవో అవతారం ఎత్తాలి. మనం దావోస్‌ వెళ్లి అడిగినంత మాత్రాన... ఏ కంపెనీ ఒక గంటలోనో, ఒక రోజులోనో రూ.వేల కోట్ల పెట్టుబడులపై నిర్ణయం తీసేసుకుని అప్పటికప్పుడు ఒప్పందాలు చేసేసుకోదు. కొన్ని నెలల ముందు నుంచే సంప్రదింపుల ప్రక్రియ, కసరత్తు జరుగుతుంది. ఏపీతో ఒక్క విదేశీ కంపెనీ దావోస్‌లో పెట్టుబడులపై ఒప్పందం చేసుకోలేదంటేనే... మనం ఆ దిశగా గట్టి కసరత్తు చేయలేదని అర్థమవుతోంది. ‘దావోస్‌కి ఐదారు వందల మంది ప్రముఖులు వస్తారు. మనం ఎవర్ని కలవాలనుకుంటున్నామో ‘టాప్‌లింక్‌’లో తెలియజేయాలి. వారికి ఆసక్తి ఉంటే సమావేశం జరుగుతుంది. ఒకవేళ మనతో కలిసేందుకు వారికి ఆసక్తి లేకపోతే, వివిధ రూపాల్లో మనకున్న పరిచయాల్ని ఉపయోగించి వారిని ఒప్పించాలి. ఒక విదేశీ లేదా స్వదేశీ కంపెనీ ఎండీనో, సీఈవోనో మన రాష్ట్రానికి ఆహ్వానించి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలంటే 1, 2 వారాలు పడుతుంది. అదే దావోస్‌లో అయితే 3, 4 రోజుల్లోనే 30-40 సమావేశాలు నిర్వహించవచ్చు. దానికి ముందస్తు కసరత్తు చాలా ముఖ్యం’ అని తెలంగాణ నుంచి దావోస్‌కి వెళ్లిన ప్రతినిధి తెలిపారు.

ఇవీ చూడండి..

Jagan Davos Tour: కొవిడ్ సంక్షోభాన్ని ఏపీ సమర్థంగా ఎదుర్కొంది: సీఎం జగన్‌

దావోస్‌లో సీఎం జగన్​.. నేడు డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details