ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చిన్న పరిశ్రమలకు అండగా ప్రభుత్వం'.. రూ.512 కోట్లు విడుదల

కరోనాతో కుదేలైన పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పరిశ్రమలు తిరిగి కోలుకునేందుకు సకాలంలో రాయితీలు చెల్లించడం సహా అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. గత ప్రభుత్వం పరిశ్రమలకు బకాయి పెట్టిన రూ.4 వేల కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంఎస్ఎంఈ రెండో విడత బకాయిలను సీఎం విడుదల చేశారు.

'చిన్న పరిశ్రమలకు అండగా ఉంటాం'.. రూ.512 కోట్లు విడుదల
'చిన్న పరిశ్రమలకు అండగా ఉంటాం'.. రూ.512 కోట్లు విడుదల

By

Published : Jun 29, 2020, 1:14 PM IST

Updated : Jun 29, 2020, 3:36 PM IST

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు... రెండో విడత బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్​.. రూ.512.35 కోట్ల బకాయిలను విడుదల చేశారు. ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో నేరుగా ఎంఎస్ఎంఈల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల నుంచి లబ్ధిదారులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. చిన్న సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

సీఎం ఏమన్నారంటే..!

  • రాష్ట్రంలో 97,428 యూనిట్లు ఉండగా.. 72,531 సూక్ష్మ పరిశ్రమలు, 24,552 చిన్న పరిశ్రమలు, 645 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
  • కరోనాతో కుదేలైన చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వీటి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చేస్తాం.
  • గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు రాయితీల రూపంలో బకాయి పడ్డ రూ.800 కోట్లు తీర్చాం. పరిశ్రమలకు వెసులుబాటు కల్పించేలా రూ.188 కోట్ల మూడు నెలల విద్యుత్​ ఫిక్స్​డ్​ ఛార్జీలు మాఫీ చేశాం.
  • రాష్ట్ర ఆర్థిక సంస్థ ఏపీఎస్​ఎఫ్​సీ ద్వారా చిన్న పరిశ్రమలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ తక్కువ వడ్డీకే వర్కింగ్​ క్యాపిటల్​ రుణం మంజూరు చేస్తాం.
  • రుణాల చెల్లింపుపై 6 నెలల మారటోరియంతో పాటు.. మూడేళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించాం.
  • ప్రభుత్వానికి ఏటా అవసరమైన దాదాపు 360 రకాల వస్తువులు, ఇతర సామాగ్రిలో 25 శాతం ఎంఎస్​ఎంఈల నుంచి తీసుకోవాలని నిర్ణయించాం.
  • చిన్న పరిశ్రమల కోసం దాదాపు రూ.1,100 కోట్లు వెచ్చించాం.

స్పిన్నింగ్​ మిల్లులకు వచ్చే ఏడాది బకాయిలు

స్పిన్నింగ్​ మిల్లులకు ఇవ్వాల్సిన రూ.1,000 కోట్ల ప్రోత్సాహక బకాయిలను వచ్చే ఏడాది చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్​ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు దాదాపు 4 వేల కోట్ల బకాయి పెట్టిందన్న సీఎం.. రాష్ట్ర ఆర్థికస్థితి బాగాలేకున్నా ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈలకు సహాయం చేశామన్నారు. పద్ధతి ప్రకారం పరిశ్రమలను ఆదుకుంటామన్నారు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వసనీయత పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

జేసీ నియామకం

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల బాగోగులు చూసేందుకు ప్రత్యేకంగా ఓ జాయింట్​ కలెక్టర్​ నియమించినట్లు సీఎం తెలిపారు. పనులు కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్ధితి ఉండకూడదని... జేసీలు, కలెక్టర్లు వీరికి చేయూత ఇవ్వాలని సూచించారు. అప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందన్నారు.

ఇదీ చూడండి..

అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై తెదేపా నేతల ఆందోళన

Last Updated : Jun 29, 2020, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details