శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు.. రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలను చర్చించి ఆమోదించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న మంత్రివర్గ సమావేశ మందిరంలో కేబినెట్ కొనసాగుతోంది.
ఇసుక, మద్యం అక్రమాలను నియంత్రణ నిమిత్తం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేయనుంది. ప్రత్యేక ప్రభుత్వ విభాగంగా ఎస్ఈబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందు కోసం.. బిజినెస్ రూల్స్ ను కూడా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం దీనికి ఆమోదాన్ని తెలపాల్సి ఉంది.
రాష్ట్రంలో పరిశ్రమల వ్యర్ధాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్‌కు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అలాగే గత శాసనసభలో ఆమోదం పొందని 4 ఆర్డినెన్సులను రాటిఫై చేయనున్నట్టు సమాచారం. అలాగే నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదాన్ని తెలియచేసే అవకాశం ఉంది.