మార్కెటింగ్, సహకారశాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష మార్కెటింగ్, సహకారశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ధరల స్థిరీకరణ, మార్కెట్లలో కనీస సదుపాయాలు, పప్పుధాన్యాల బోర్డులు, సహకార రంగం పటిష్టత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పప్పు ధాన్యాల కొనుగోలు కేంద్రాలపై ముఖ్యమంత్రి ఆరాతీశారు. ఆరుతడి పంటలపై అక్టోబరు 10 నుంచి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. అక్టోబరు 15 నుంచి కొనుగో కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతు బజార్లలో రాయితీ ఉల్లిపాయల విక్రయం ద్వారా ధరలు నియంత్రించినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
చిరుధాన్యాల హబ్‌గా రాయలసీమ
రాయలసీమను చిరుధాన్యాల హబ్‌గా మార్చాలన్న సీఎం అక్టోబరి చివరి నాటికి చిరుధాన్యాల బోర్డు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్, ప్రాససింగ్ అన్నీ బోర్డు పరిధిలో ఉంచాలని సీఎం సూచించారు. పంటలు వేసేముందే ధరల ప్రకటన చేయాలని సీఎం ఆదేశించారు. ధరల విషయంలో ప్రభుత్వం జోక్యంచేసుకున్న తర్వాత పరిస్థితిలో మార్పు కచ్చితంగా రావాలని ప్రభుత్వం భరోసా కల్పించిందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్నారు. ప్రకటించిన ధర ఏమాత్రం తగ్గుతున్నా ఆదుకోవడానికి తగిన ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. 6 నెలల్లోగా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలన్నారు. గ్రామ సచివాలయాల్లోనే పంట ఉత్పత్తుల వివరాలు, ధరలు ప్రకటించాలని సీఎం ఆదేశించారు
50 శాతం పదవులు మహిళలకు
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, గోదాములపై సమగ్ర పరిశీలన జరగాలని సీఎం ఆదేశించారు. మత్స్య ఉత్పత్తుల కోసం ఎన్ని శీతల గిడ్డంగులు ఉండాలన్న దానిపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. మార్కెట్ ఛైర్మన్లలో సగం మహిళలకు కేటాయించాలని సూచించారు. సహకార రంగాన్ని పునర్‌వ్యవస్థీకరించాలని, సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.