రైతు భరోసా పథకం రెండో ఏడాది నిధుల జమ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ముందుగా చెప్పిన దానికంటే ఎక్కువగా రూ.13,500 ఇవ్వగలుగుతున్నామన్నారు. పెట్టుబడి సాయంతో రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. మేలోనే రూ.7,500 ఇవ్వాలనుకున్నాం..కానీ కరోనా కారణంగా ఏప్రిల్‌లో రూ.2 వేలు ఇచ్చామని తెలిపారు.
జూన్ పంటకు సన్నద్ధమయ్యేందుకు పెట్టుబడి కోసం రూ.5,500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అటవీ ప్రాంతంలో భూములు సాగుచేసుకుంటున్న వారికి రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. సంక్రాంతి వేళ మూడో విడతగా మరో రూ.2 వేలు అందిస్తామని వివరించారు.
రైతు భరోసాకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది మా ప్రభుత్వం లక్ష్యం. కులాలు, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరుతుంది. మరో 15 రోజులైనా, నెల రోజులైనా అర్హత ఉన్న ప్రతి రైతు నమోదు చేసుకోవచ్చు. రైతుల పాత అప్పులకు జమ కాకుండా నగదు అందిస్తున్నాం. బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే 1902కు ఫోన్ చేయవచ్చు.రైతుకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తోంది. -ముఖ్యమంత్రి జగన్