ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2020, 4:08 PM IST

Updated : Apr 11, 2020, 6:25 PM IST

ETV Bharat / city

రెడ్​ జోన్లలోనే లాక్‌డౌన్‌... ప్రధానికి సీఎం విజ్ఞప్తి

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్ డౌన్ పొడిగించే పక్షంలో ఆంధ్రప్రదేశ్​లో రెడ్ జోన్లకు మాత్రమే దీన్ని పరిమితం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించారు. కరోనా ప్రభావితం కాని ప్రాంతంలో లాక్ డౌన్ విధించి లాభం లేదని.... రాష్ట్ర, దేశ ఆర్థిక ప్రగతి ముందుకు సాగాలంటే ఈ వ్యూహం పాటించాలన్న సూచన చేస్తున్నట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యంత్రులతో వీడియో కాన్ఫరెన్సు కార్యక్రమంలో సీఎం జగన్ ఈ ప్రతిపాదనల్ని ప్రధాని ముందు ఉంచారు.

cm jagan interacting with pm modi over lock down
cm jagan interacting with pm modi over lock down

రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్​ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించారు. రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఈ ఆంక్షలు సడలించటమే మేలని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు కార్యక్రమంలో రాష్ట్ర సీఎం జగన్ ఈ ప్రతిపాదన చేశారు. ఏపీలో 676 మండలాలు ఉన్నాయని... ఇందులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న రెడ్ జోన్​లో 37 మండలాలు ఉన్నాయని...అలాగే ఆరెంజ్ జోన్లో 44 మండలాలు ఉన్నాయని ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ వివరించారు. మిగతా 595 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని.. ఇక్కడ ప్రస్తుతానికి కరోనా ప్రభావం లేదని సీఎం వివరించారు. లాక్ డౌన్​ను కొనసాగించే పక్షంలో రెడ్ జోన్లకే పరిమితం చేయాల్సిందిగా ప్రతిపాదిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రధానికి తెలిపారు. జనం గుమిగూడకుండా షాపింగ్ మాళ్లు, సినిమాహాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నది తన అభిప్రాయమన్నారు.

లాక్ డౌన్​ను రెడ్​ జోన్లకే పరిమితం చేయండి: ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి

పటిష్టంగా లాక్ డౌన్ అమలు

ఈ విషయంలో తన అభిప్రాయంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై సంక్షిప్తంగా ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నట్టు వివరించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశా వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోందని తెలిపారు.

కొవిడ్ ఆస్పత్రుల వివరాలు వెల్లడి

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకూ ఒక కొవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నామని సీఎం వివరించారు. జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నట్టు వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయిందన్నారు. రవాణా మధ్యలో నిలిపివేస్తారనే భయంతో 25శాతం మించి ట్రక్కులు తిరగడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు.

కేంద్ర నిర్ణయాలను సమర్థిస్తాం

పరిశ్రమలు నడవనప్పుడు యజమాన్యాలు జీతాలు చెల్లించగలరని ఎలా ఆశిస్తామని వీడియో కాన్ఫరెన్సులో సీఎం వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్​కు ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తిందని అన్నారు. కొవిడ్‌ని–19 నివారణకు ప్రధాని మంత్రిగా తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నామని తెలిపిన సీఎం...అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది తన అభిప్రాయమన్నారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో 400 దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

Last Updated : Apr 11, 2020, 6:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details