ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్తు, నీరు సమకూర్చుతామని హామీఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం జగన్... యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమలు పెట్టాలనుకునేవారు కేవలం ఒక దరఖాస్తు నింపితే చాలని... మిగిలిన పనులన్నీ సీఎం కార్యాలయమే చూసుకుంటుందని జగన్ స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ... పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు సహకరిస్తుందని సీఎం అన్నారు.
విశాలమైన సముద్రం తీరం కలిగిన ఏపీలో కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామన్న జగన్... వీటిలో భాగస్వాములు కాలాలని పెట్టుబడిదారులను కోరారు. డీశాలినేషన్, మెట్రోరైళ్లు, బకింగ్‌హాం కాల్వ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ విస్తరణ, ఆక్వా ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ వంటి అపార అవకాశాలున్నాయని వివరించారు. కేంద్రం, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తమకు చక్కటి సంబంధాలున్నాయన్న జగన్... విద్యుత్తు ఒప్పందాల పునఃసమీక్షతో పంపిణీ సంస్థలు నిలదొక్కుకుంటాయని పేర్కొన్నారు. వారం రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్న సీఎంకు ఘనస్వాగతం లభించింది.