జులై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నిర్దేశించిన తేదీనాటికి వందశాతం కచ్చితంగా ఇళ్లపట్టాల పంపిణీ పూర్తి కావాలని జగన్ పేర్కొన్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అన్నారు. కొవిడ్ తగ్గుముఖం పట్టిన అనంతరం గ్రామాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇంటిపట్టా రాకపోతే సదరు అధికారులే బాధ్యులుగా ఉంటారని సీఎం హెచ్చరించారు. పెన్షన్ కార్డు, రేషన్ కార్డులను 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ కార్డును 20 రోజుల్లో, ఇంటిపట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందించాలని సూచించారు. గడువులోగా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు.
ఇసుక నిల్వ చేయాలి
వర్షాకాలంలో పనుల కోసం 46.30 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్దేశించుకున్న 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాకాల సీజన్ ప్రారంభమైన దృష్ట్యా వచ్చే రెండు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. రీచ్లు మునిగే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పుడే ఇసుక నిల్వ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నదులు, వాగుల నుంచి ఎడ్ల బండ్లతో ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి ప్రభుత్వం అనుమతించిందని.. త్వరలోనే ట్రాక్టర్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్లు, అంగన్వాడీ కేంద్రాల మీద పూర్తిగా కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల అంగన్వాడీ భవనాలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. జగనన్న పచ్చతోరణం కింద 6 కోట్ల మొక్కల్ని నాటాలి. పట్టణ ప్రాంతాల్లో వార్డు క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరిట నిర్మాణం చేపట్టాలి. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే నాడు-నేడు కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలి. ఆగస్టు 9న ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేసి.. గిరిజనులకు జీవనాధారం చూపించాలి.