రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందేలా నెట్‌వర్క్ ఆసుపత్రులను ప్రోత్సహించాలని రహదారి భద్రత మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఆధునిక పద్ధతుల్లో అత్యవసర సేవలు అందించాలని, ఇందుకోసం కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న 16 వైద్య కళాశాలల్లో ట్రామా కేర్ సెంటర్లు ఉండాలన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తెచ్చేవారికి మద్దతు ఇవ్వాలి. బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రహదారులపై లైన్ మార్కింగ్ స్పష్టంగా ఉండాలి. ద్విచక్ర వాహనాలు, కార్లకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి. వాహనాలు ఎంత వేగంతో వెళ్లాలి అనేదానిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. వీటివల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. రహదారుల పక్కన ఉండే దాబాల్లో మద్యం విక్రయించకుండా చూడటం ద్వారా కూడా ప్రమాదాలు తగ్గుతాయి. ప్రధాన రహదారులకు పక్కన యాక్సెస్ బ్యారియర్లు ఉండాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వ సహకారంతో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష జరపాలి. జిల్లా స్థాయిలోనూ సమీక్షలు నిర్వహించాలి. ఇలా అయితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. రోడ్డు ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా రిహాబిలిటేషన్ కేంద్రాన్ని విశాఖలో ఉంచాలి. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో ఉన్న కేంద్రాన్ని మెరుగుపరచాలి’ అని సూచించారు. రహదారి భద్రతకు సంబంధించి లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. ఇందులో పోలీసు, రవాణా, వైద్య, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ నిపుణులు ఉంటారు. అలాగే రహదారి భద్రత నిధి ఏర్పాటుకు కూడా సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో రహదారులపై 1,190 బ్లాక్ స్పాట్స్ గుర్తించగా, వీటిలో 520 సరి చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఆర్‌అండ్‌బీ నిర్వహిస్తున్న జాతీయ రహదారుల్లో 78 బ్లాక్ స్పాట్స్ సరి చేశామని వారు చెప్పారు.
బీచ్ కారిడార్ రహదారికి ప్రాధాన్యం: సీఎం