శ్రీకాకుళం జిల్లాలో..
రైల్వేను ప్రైవేటీకరణ చేయవద్దని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళం రోడ్డు, పలాస రైల్వే స్టేషన్ల వద్ద ఆందోళన చేపట్టారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేయడం తగదన్నారు. కరోనా కాలంలో ప్రజల ఇబ్బందులను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. రైల్వే శాఖను కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి.
విశాఖ జిల్లాలో..
రైల్వే ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. పిలుపులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ ఇతర ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని చీడికాడలో డివిజన్ స్థాయిలో సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే, వైద్యం ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.
కృష్ణా జిల్లాలో..
రైల్వే ప్రైవేటీకరణ ప్రయత్నాలు వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పులు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు అనుకూలంగా చర్యలు చేపట్టడం గర్హనీయం అన్నారు.
గుంటూరు జిల్లాలో..
రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నేతాజీ డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న నిర్ణయాలను మార్చుకోకపోతే పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని అయన హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో..
రైల్వే ప్రైవేటీకరణను నిరాకరిస్తూ చీరాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను అవకాశంగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని సీపీఎం చీరాల కమిటీ కార్యదర్శి బాబూరావు ఆరోపించారు. లాభాల బాటలో ఉన్న రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.