ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం తీరును నిరసిస్తూ కార్మిక సంఘాల నిరసన - సీఐటీయూ నిరసన తాజా వార్తలు

టెలికాం, రైల్వే, బీమా, విమానయాన రంగాల అమ్మకాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాలు సంయుక్తంగా నిరసనలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి… కార్మిక చట్టాలను హరిస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు.

citu aituc protest in ap against privatisation of government sectors
రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేప్టటిన కార్మిక సంఘాలు

By

Published : Aug 9, 2020, 9:41 PM IST

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల నిలుపుదలకై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు రాష్ట్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఎం సంఘాలు నిరసన చేపట్టాయి.

కడప జిల్లాలో..

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను నిరసిస్తూ కడప టెలికాం కార్యాలయం వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాలు నిరసన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని తెలిపారు. కేంద్ర రంగాలను అమ్మకానికి పెట్టడం దారుణమని ఖండించారు. ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ అనంతపురంలో సీపీఎం, సీఐటీయూ, కార్మిక సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ‘సేవ్​ ఇండియా’ పేరుతో ఆదివారం నిరసన తెలిపారు. నగరంలో లాక్​డౌన్​ అమలలో చేస్తున్నందున పోలీసులు వీరిని అరెస్ట్​ చేశారు. వీరిని 2వ పట్టణ పోలీసు స్టేషన్​కు తరలించారు. పోలీస్​ స్టేషన్​ వద్ద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కర్నూలు జిల్లాలో..

కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ. గఫూర్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని చూస్తోందని దానిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌ కాలంలో కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు వేతనాలను తగ్గించ కూడదని కోరారు. వలస కార్మిక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి వారికి ఉపాధి పనులు కల్పించాలని కోరారు.

విశాఖ జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నర్సీపట్నంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆర్డీవో కార్యాలయం వద్ద రాస్తారోకో చేపట్టారు. నేటి ప్రభుత్వ విధానాలతో దేశం అభివృద్ధి పరంగా వెనుకంజలో ఉందని సీఐటీయూ అధ్యక్షుడు సత్తిబాబు పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విడనాడాలని నెల్లూరులో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ‘సేవ్ ఇండియా - సేవ్ వర్కింగ్ క్లాస్ - సేవ్ పీపుల్’ పేరుతో కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ, కార్మిక చట్టాలను హరిస్తున్నారని కార్మిక సంఘ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details