పై విధంగా ఆవేదన వ్యక్తం చేస్తోంది ఓ యువతి! ఇదంతా ఏంటో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారా? కాస్త ఆగండి. పైన చెప్పినదంతా.. యుక్త వయసులో ఉన్న ఓ యువతి ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ. వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు కానీ.. అబ్బాయిలు కానీ.. సినీ తారలపై వ్యామోహం పెంచుకోవడం సహజమే. అయితే.. ఈ కథనంలోని యువతి ఆకర్షణ మాత్రం మీటరుకు అందకుండా ఉంది. అరుదుగా కొందరు ఇలాంటి భావనకు లోనవుతుంటారు. ఈ కోవకే చెందిన యువతి.. కౌన్సెలింగ్ కోరుతూ సైకాలజిస్టుకు రాసిన లేఖనే.. ఇప్పుడు మనం చదువుతున్నాం. దీనికి సైకాలజిస్టు ఏం చెప్పారంటే...
"మీవయసెంతో తెలియజేయలేదు. సహజంగా యుక్త వయసులో ఇలాంటివి జరుగుతుంటాయి. చాలామంది అమ్మాయిలు తమని బాగా ప్రేమించే వ్యక్తి దొరకాలని, సినిమాల్లో హీరో, హీరోయిన్లలా తమ అనుబంధం ఉండాలని ఆశ పడుతుంటారు. తమ స్నేహితుల్లో ఎవరైనా అలాంటి ప్రేమికులు ఉంటే వాళ్లని రోల్‌మోడల్‌గా చూస్తారు. వాళ్లలా ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటారు. సినిమాలు, సీరియళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఇలా ఊహల్లో తేలిపోతుంటారు. ఆ పాత్రల్లో తమని తాము ఊహించుకొని మురిసిపోతారు. నిజ జీవితంలో సాధ్యపడని వాటిని తెరపై తమకు కనెక్ట్ చేసుకొని సంతోషిస్తారు. ఇలా ఊహాజనిత ప్రపంచంలో ఉన్నవారికి తీవ్రమైన భావోద్వేగాలు కూడా మొదలవుతాయి. కానీ.. ఇదంతా ఊహ. నిజం కాదు. ఈ విషయాన్ని మీ మనసుకు అర్థం చేయించండి" అని చెప్పారు.