రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మడమ తిప్పారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘అమరావతినే రాజధానిగా పెట్టండి. చిన్న రాష్ట్రం... ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు. 30 వేల ఎకరాలు సరిపోతుందని ఎన్నికల ముందు అసెంబ్లీలో చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే.. మూడుముక్కలాట ఆడుతున్నారు. అమరావతి ఏ కొద్దిమంది రాజధానో కాదు... ఇది ప్రజలు కోరుకున్న రాజధాని.. అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఆశీర్వదించిన రాజధాని... రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతిపై ఆయనకు ఎందుకింత కుళ్లు?’ అని నిలదీశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు తిరుపతి సభకు వస్తుంటే అడ్డుపడ్డారని, నేతల ఇళ్లకు పోలీసుల్ని పంపారని ఆరోపించారు. తిరుపతిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ... ‘అమరావతి మునిగిపోతుందన్నారు.. దేశంలోని ఎన్నో నగరాల్లోకి వరద నీరొచ్చినా ఈ మూడేళ్లలో అమరావతి ఎప్పుడైనా మునిగిందా? పునాది సరిగా ఉండదన్నారు. హైదరాబాద్, చెన్నై కంటే బ్రహ్మాండమైన పునాదులు వేసుకోవచ్చని చెన్నై ఐఐటీ చెప్పింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అన్నారు. భూసేకరణలో అలాంటి పదమే లేదని హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పాయి’ అని గుర్తుచేశారు.
ధర్మపోరాటంలో విజయం రైతులదే
‘రెండేళ్లపాటు సాగిన అమరావతి రైతుల ఉద్యమంలో 180 మంది చనిపోయారు. 2,500 మంది రైతులపై కేసులు పెట్టారు. 500 మందిని జైలుకు పంపారు. 45 రోజులపాటు 450 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్రలోనూ వంద కేసులు పెట్టారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టిన పనికిమాలిన దద్దమ్మ ప్రభుత్వమిది’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘ఎస్సీల భూములకూ రైతులకు ఇచ్చిన తీరునే నష్టపరిహారం ఇస్తే... అదీ తప్పని కేసులు పెట్టారు. వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా. ఎన్ని కేసులు పెట్టినా మేం చేసేది ధర్మపోరాటం. ఇందులో విజయం రాజధాని అమరావతి రైతులదే. త్యాగం అమరావతి రైతులది, పోరాటం అమరావతి రైతులది. వారు చేసే పోరాటం అయిదు కోట్ల ఆంధ్రుల కోసం’ అని స్పష్టంచేశారు.
అమరావతి... గుంటూరు, విజయవాడల మధ్య ఉంది. రాష్ట్ర రాజధానికి 50% జనాభా ఒకపక్కన ఉంటే 50% మరో పక్కన ఉంది. 12 పార్లమెంట్ స్థానాలు ఒకవైపు మరో 12 ఇంకోవైపున్నాయి. శ్రీకాకుళం, అనంతపురంతోపాటు ఇతర అన్ని ప్రాంతాలకు దగ్గర ఉండే ఏకైక ప్రాంతం అమరావతే.
అమరావతి న్యాయస్థానం నుంచి కలియుగ దేవుడు వేంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు రైతులు పాదయాత్ర చేస్తుంటే... పోటీగా తిరుపతిలో బలప్రదర్శన చేయించారు. మూడు రాజధానుల కోసమని చెప్పకుండా కళాశాలల నుంచి బలవంతంగా విద్యార్థుల్ని సమీకరించారు. వారంతా కూడా జైఅమరావతి అన్నారంటే... అదీ అమరావతి శక్తి.
- తెదేపా అధినేత చంద్రబాబు
ఇక్కడకొచ్చిన నేతలందరిదీ ఏ కులం?
రాజధాని అమరావతికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా సహా కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలూ అమరావతే రాజధాని అని స్పష్టంగా చెప్పారన్నారు. ‘అమరావతిపై కులముద్ర వేస్తున్నారు... అమరావతి పరిరక్షణ సమితి శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిరక్షణ సమితి శ్రీనివాస్‌లది ఏ కులం? ఇక్కడకు వచ్చిన నాయకులందరిదీ ఏ కులం? సమాధానం చెప్పే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా?’ అని ఆగ్రహం వెలిబుచ్చారు. ‘అమరావతికి ప్రధాని మోదీ దసరా రోజున వచ్చి శంకుస్థాపన చేశారు. రూ.2,500 కోట్ల డబ్బు ఇచ్చారు. రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇచ్చారు. ఇన్ని చేశాక... ఇష్టానుసారం మార్చేస్తానంటే ఎలా కుదురుతుంది?’ అని ప్రశ్నించారు.