New Type Insect Attack on Chilli Crop: నల్లతామర దెబ్బకు మిరప రైతులు నిలువునా నష్టపోయారు. సాగు చేసిన మొత్తం విస్తీర్ణంలో 85% పైనే మిరప పంట దెబ్బతింది. సగటున చూస్తే.. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి నష్టం ఉంటుందని అంచనా. సుమారు రూ.4,360 కోట్ల వరకు పెట్టుబడులు నష్టపోయారు. ఇది రైతుల పాలిట పెను విపత్తే. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నా.. ఇప్పటి వరకు వ్యవసాయ, ఉద్యాన శాఖల నుంచి ఎలాంటి స్పందన లేదు. పంటల బీమా చెల్లిస్తారా? లేదా అనే విషయంపైనా స్పష్టత కొరవడింది. కనీసం ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని రైతులు డిమాండు చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో ఈ ఏడాది 5.13లక్షల ఎకరాల్లో మిరప వేశారు. అయితే ఇందులో ఈ ఏడాది ఇప్పటికే 90% వరకు ఈడుబోయింది. కొన్నిచోట్ల చూడ్డానికి పొలాలు పచ్చగా ఉన్నా క్వింటాల్ కాయలు కూడా కోయలేని పరిస్థితి నెలకొంది. పురుగు ప్రభావం తగ్గినట్లు కొంతమేర పూత కనిపిస్తున్నా.. అదీ నిలవడం లేదని రైతులు చెబుతున్నారు. సగటున ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లకు మించే పరిస్థితి లేదని వాపోతున్నారు. కొందరైతే కిలో కూడా కోయక ముందే తోటలను తొలగించేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 40 నుంచి 80 శాతం మేర పంట దెబ్బతిందని కేంద్రం రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో పేర్కొనడం గమనార్హం.
బీమాకు పూర్తి బాద్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్రంలో ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. సాగు చేసిన ప్రతి ఎకరాను ఈ-క్రాప్ ఆధారంగా బీమా పరిధిలోకి తెచ్చింది. కేంద్రం అమలు చేసే పీఎంఎఫ్‌బీవై, వాతావరణ ఆధారిత బీమా పథకాలతో ఎలాంటి సంబంధం లేదు. దీంతో బీమాకు సంబంధించి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోంది. మిరపలో వాతావరణ ఆధారిత, దిగుబడి ఆధారిత బీమా పథకాలు అమల్లో ఉన్నాయి. ఈ బీమా పథకాల నిబంధనల ప్రకారం లెక్కలు కట్టి చెల్లింపులు చేస్తే రైతుకు ఎంతమేర పరిహారం అందుతుందనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతోంది.
- మిరప నష్టం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. తెలంగాణ సహా కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ రైతులు పెద్దఎత్తున పెట్టుబడులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మిరప రైతుల్ని ఆదుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
ఎకరాకు రూ.లక్ష ఇస్తేనే రైతుకు ఊరట
‘మిరపలో సొంత భూమి ఉన్న రైతుకు రూ.లక్ష, కౌలు రైతుకు రూ.1.50లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు రైతుల్ని తక్షణమే ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలి. పంటల బీమాతోపాటు ప్రకృతి విపత్తుగా పరిగణించి పెట్టుబడి రాయితీ అందించాలి’ అని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా మిరప పంటకూ వర్తిస్తుంది. దిగుబడి తగ్గితే పంటల బీమా పొందేందుకు సాగు చేసిన రైతులు అర్హులవుతారు’ అని వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు.