కరోనాను మించి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకర వైరస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పేరుమోసిన క్రిమినల్స్‌ను అడ్డంపెట్టుకుని వారితో తప్పుడు కేసులు వేయిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ నా ఇల్లు-నా సొంతం, నాస్థలం నాకివ్వాలి పేరిట రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలు, అన్ని నియోజకవర్గ ఇంఛార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
"తప్పుడు వార్తలనే నిజాలుగా ప్రజలను నమ్మించటంలో జగన్ ఘనుడు. కుల, మతం విద్వేషాలు రగిలించడంలో ఆరితేరాడు. పేరుమోసిన క్రిమినల్స్‌తో కేసులు వేయించడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి మంచివాళ్లపై బురద జల్లడం వైకాపా నేతల నిత్యకృత్యం. కేంద్రమంత్రి పేరుతో అక్రమ వసూళ్లు, బెదిరింపులు, హత్యాయత్నాలు, దందాలు చేసిన వారితో పిల్ వేయించి సామాజిక మాధ్యమాల్లో వాటిని వైరల్ చేశారు. మోసగించే వారితోను, పేకాట దందాలు నడిపేవారిని ఇందుకు వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సీజేఐకు రాసిన లేఖ కోర్టు ధిక్కరణే అని స్పష్టం చేసిన న్యాయ నిపుణులపైనా వైకాపా బురద జల్లడం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. చేసిన తప్పులను తెదేపాకు ఆపాదించి తప్పించుకోవాలనుకునే జగన్ మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. తన అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారు. డొల్ల కంపెనీలు, మనీ లాండరింగ్, అవినీతి కుంభకోణాల కేసుల దర్యాప్తులో జరిగే జాప్యం ఒక శృంఖలాన్ని తయారుచేస్తుంది. భవిష్యత్తు కుంభకోణాలకు అదే పునాదిరాయిలా మారుతుంది. అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోకపోతే దేశాభివృద్దికి అవరోధం అన్న ప్రధాని వ్యాఖ్య జగన్‌కు వందశాతం వర్తిస్తాయి"-చంద్రబాబు
తెదేపాపై బురదజల్లే శ్రద్ధ పోలవరంపై లేదు..
ఆంధ్రప్రదేశ్ ప్రాణనాడి పోలవరంలో వైకాపా ప్రభుత్వం చేసిన అనేక తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయని చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండర్లు, అంచనాల పెంపులో చేసిన తప్పుడు ఆరోపణలే రాష్ట్రం మెడకు చుట్టుకున్నాయన్నారు. తెదేపాపై బురద జల్లడంలో చూపే శ్రద్ధ కేంద్రాన్ని ఒప్పించి పోలవరం పనుల వేగంగా పూర్తి చేయటంపై పెట్టడం లేదని విమర్శించారు. వైఎస్ హయాంలో రూ.400కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. తెదేపా 5ఏళ్లలో రూ.11వేల కోట్లు ఖర్చు చేసి 71శాతం పనులు పూర్తి చేసిందని గుర్తు చేశారు. నీటిపారుదల రంగానికి రూ.64వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి, వైకుంఠపురం, బొల్లాపల్లి రిజర్వాయర్, హంద్రీ-నీవా పనులు అన్ని ప్రాజెక్టుల పనులను వైకాపా ప్రభుత్వం నిలిపేసి రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని ధ్వజమెత్తారు.
పేదల సొంతింటి కల సాకారానికి 12లక్షల ఇళ్లు నిర్మిస్తే తెదేపాకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో వాటిని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టిన ఇళ్లు ఎప్పుడిస్తారా అని లబ్ధిదారులు ఎదురుచూస్తుంటే ఏడాదిన్నరగా వాటిని ఇవ్వకుండా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను రద్దు చేయటం తగదని హితవు పలికారు. సంక్రాంతికల్లా ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుంటే వాళ్లే వాటిని సొంతం చేసుకుంటారని స్పష్టం చేశారు. ఎవ్వరి ఇళ్లలో వారు నివాసం ఉండేవరకూ తెదేపా బాధితుల తరఫున పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వైకాపా పారిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు.
జగన్ చరిత్రలెన్నో..