‘నేరస్థులు పాలకులైతే నిరపరాధులంతా జైలుకే అన్న వాక్యాలు ఏపీలో అక్షర సత్యాలు’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అయ్యన్నపాత్రుడిపై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీ నాయకులపై జగన్ కక్ష సాధిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘అయ్యన్నపై అక్రమ కేసు వైకాపా కక్ష సాధింపునకు మరో రుజువు. నాలుగు రోజుల్లో బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టడం ఆ వర్గంపై సీఎం అక్కసుకు నిదర్శనం. రాష్ట్రంలో వారి నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకే వైకాపా కుట్ర చేస్తోంది. బీసీ సంక్షేమంలో కోతలు, సంక్షేమ పథకాల రద్దులు, నాయకులపై తప్పుడు కేసులు.. ఈ చర్యలే వెనకబడ్డ వర్గాల పట్ల సీఎం వైఖరిని తెలియజేస్తున్నాయి. వారంటే తొలినుంచీ జగన్‌కు కక్షే. తెదేపాకు వారు వెన్నెముకగా ఉన్నందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం అచ్చెన్నాయుడి అరెస్టు.. మొన్న యనమల రామకృష్ణుడిపై కేసు.. ఈ రోజు అయ్యన్నపాత్రుడిపై తప్పుడు కేసు. ఇవే జగన్ దుర్మార్గాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు. తప్పుడు కేసులతో తెదేపా నాయకులు, కార్యకర్తలపై పగ తీర్చుకోవాలని చూడటం శాడిజం. బీసీలంతా ఏకం కావాలి. వైకాపాకు బుద్ధి చెప్పాలి. సీఎం జగన్ దుశ్చర్యలను ఖండించాలి. వైకాపా అరాచకాలపై రాజీ లేని పోరాటం చేస్తున్న తెదేపాకు అండగా నిలబడాలి’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
మాటతూలితే నిర్భయ కేసుపెడతారా? వర్ల రామయ్య
‘మాట తూలితేనే అయ్యన్నపై నిర్భయ కేసా..? కరుడుగట్టిన నేరస్థులను శిక్షించేందుకు రూపొందించిన నిర్భయ చట్టం మీ పాలనలో రూపు మార్చుకుందా జగన్? అనునిత్యం మీ పాలనను ఎండగట్టే అయ్యన్నపై నిర్భయ కేసు పెట్టడం కక్షసాధింపు కాదా? మాట తూలడంపై ఇతర సెక్షన్లేవీ లేవా?’ అని తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు.