గోదావరి వరదలతో జల దిగ్బంధంలో చిక్కుకున్న వందలాది గ్రామాల ప్రజలను ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉద్ధృతితో ఉభయ గోదావరి జిల్లాలలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చంద్రబాబు అన్నారు. లంక గ్రామాలకు రాకపోకలు స్థంభించి ప్రజల అవస్థలు పడుతున్నారన్నారు. వరదతో పంటలు నీటమునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఒకవైపు కరోనాతో అల్లాడుతున్న ప్రజలపై, వరద ముంపు ఊహించని ఉపద్రవంగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం, రాజోలు, సఖినేటిపల్లి తదితర 65 గ్రామాల్లో 1,460 హెక్టార్లలో వరి పంట, ఎటపాక, కూనవరం మండలాల పరిధిలో 22 గ్రామాల్లో 225 హెక్టార్లలో పత్తి, 282 హెక్టార్లలో ఉద్యానపంటలు నీట మునిగాయని మీడియా కథనాల బట్టి తెలుస్తోందని లేఖలో చంద్రబాబు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని చంద్రబాబు లేఖలో సీఎంకు తెలిపారు. వరద ముంపుతో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని చంద్రబాబు ఆవేదన చెందారు.
రైతాంగాన్ని ఆదుకోండి
విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్న చంద్రబాబు.. గంటగంటకు పెరుగుతున్న వరద ఉద్ధృతితో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. కూనవరం, వీఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయన్నారు. వందలాది గ్రామాలు వరద నీట మునిగాయని, వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన చెందారు. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లో పంటలు నీట మునిగాయన్నారు. మన్యసీమ, కోనసీమలో లంకగ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్న చంద్రబాబు.. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గంలో అనేక గ్రామాలు నీటమునిగాయన్నారు. దేవీపట్నం మండలంలోనే వేలాది ఇళ్లు నీట మునిగాయని చంద్రబాబు ఆవేదన చెందారు.
యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి
ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టాలని సీఎంను చంద్రబాబు కోరారు. రెండు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుని బాధితుల్లో భరోసా నింపాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాల ద్వారా సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. తాగునీరు, భోజనం, విద్యుత్ వసతులు కల్పించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా సరైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలను తక్షణమే చేపట్టాలన్న చంద్రబాబు.. బాధితులకు కష్టకాలంలో అండగా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి:
'హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టోలు తయారు చేయలేదు'