CBN: ప్రభుత్వాలు మంచి విధానాలు రూపొందిస్తే చాలు.. డబ్బు ఖర్చు పెట్టకుండానే ప్రజలకు మేలు చేయొచ్చని చంద్రబాబు అన్నారు. దిల్లీలో ఆయన శనివారం జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మంచి విధానాలతో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పడానికి వాజ్‌పేయీ హయాంలో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు, తాను తీసుకొచ్చిన ఐటీ విధానాలే నిదర్శనమన్నారు. ‘అప్పట్లో నేను మలేషియాకు వెళ్లినప్పుడు అక్కడి రోడ్లను చూశాక భారతీయ రోడ్లు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాజ్‌పేయీ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన పెద్దమనసుతో విన్నారు. స్వర్ణ చతుర్భుజికి ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత దేశ రహదారుల ముఖచిత్రమే మారిపోయింది’ అని బాబు గుర్తుచేశారు.
‘నేను ఐటీలో కొత్త విధానం తీసుకొచ్చి, సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఆ రంగంలో తెలుగు వారి ప్రాబల్యం రెక్కలు కట్టుకొని ఎగిరింది. ఇప్పుడు ప్రపంచంలోని ఐటీ నిపుణుల్లో తెలుగువారి వాటా 30% మేర ఉంది. విదేశాల్లోనూ అక్కడి రాజకీయాలను మనవాళ్లు ప్రభావితం చేయగలిగే స్థాయికి చేరారు. రాజకీయాల్లో ఓడొచ్చు, గెలవొచ్చు కానీ, మనం ప్రవేశపెట్టిన విధానాల వల్ల తరతరాలకు మేలు కలిగితే ఎంతో సంతృప్తినిస్తుంది. సైబరాబాద్‌ను చూస్తే నాకు అదే భావన కలుగుతుంది’ అని వివరించారు.