నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా?: చంద్రబాబు - tdp
వైకాపా ప్రభుత్వ పాలనపై ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసేలా వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలవాలని కోరారు.
వైకాపా నేతల దుశ్చర్యలతో 70 ఏళ్ల రాజ్యాంగం, 73 ఏళ్ల స్వాతంత్య్రం పరిహాసం పాలయ్యాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. పురాణాల్లో చెప్పిన రాక్షస కృత్యాలను ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. వైకాపా నాయకుల బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవాలా అని నిలదీశారు. ప్రజలు నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాలరాస్తారా అంటూ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. పంట పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవటం, కష్టపడి పెంచిన చీని చెట్లను నరికేయటం, పాడి గేదెలకు విషంపెట్టి చంపటం వంటి దురాగతాలకు వైకాపా నాయకులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు వైకాపాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మానవత్వం ఉన్నవారంతా ఈ అరాచకాలను ఖండించాలని కోరారు. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడాలని అన్నారు. వైకాపా ప్రభుత్వ బాధితుల పునరావాసానికి చేదోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.