అక్రమ కేసులు, రౌడీషీట్లకు భయపడే నాయకులు తెదేపాలో లేరని అధినేత చంద్రబాబు(Chandrababu) స్పష్టం చేశారు. దేశంలో కరోనా కేసులు తగ్గినా.. రాష్ట్రంలో ప్రతిపక్షనేతలపై అక్రమ కేసులు తగ్గట్లేదని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు(atchannaidu) కుటుంబసభ్యులపై అక్రమ కేసుల్ని బనాయించడాన్ని తెదేపా అధినేత ఖండించారు. వైకాపా నేతలు చెప్పినట్లు చేసే పోలీసులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అచ్చెన్న కుటుంబీకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
వైకాపా పాలనలో రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగమవుతున్నాయని ధ్వజమెత్తారు. పాలన గాలికొదిలేసిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల్ని, వారి కుటుంబ సభ్యుల్నీ వేధిస్తున్నారని మండిపడ్డారు. మరో 3ఏళ్లే రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంటుందన్న బాబు.. అధికారం అండతో జగన్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో మూడింతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.