దీపావళి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు తెలుగు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కొంటున్నారని... ఇలానే కొనసాగితే రేపటి సమాజాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోందన్నారు. కాబట్టి స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి రేపటి పౌరుల గురించి ఆలోచించాలని చంద్రబాబు హితవు పలికారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి యువత ఉపాధికి గండికొట్టడం విషాదకరమని అన్నారు. ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలని నిలదీశారు.
రాష్ట్రంలో అటు కరోనా కల్లోలం, ఇటు వరుస వరద విపత్తులతో అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా కోలుకోలేకుండా ఉన్నారు. పాలకులు అవినీతి కుంభకోణాలతో, లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. అప్పులు తెచ్చి, అవినీతి పనులతో సొంత జేబులు నింపుకోవడం కాకుండా సమాజంలో సంపద సృష్టించే ఆలోచనలు పాలకులకు రావాలని ఆకాంక్షిస్తున్నా. పరిశ్రమలు తెచ్చి ప్రజలకు జీవనోపాధి మార్గాలు పెంచే దిశగా వారి మనసులు మారాలని దీపావళి సందర్భంగా కోరుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో ఆశావహ దృక్పథం ఒక్కటే మన జీవితాలలో వెలుగులు నింపుతుంది. చీకట్లను పారద్రోలే వెలుగుపూల దీపావళి తెలుగువారి లోగిళ్ళలో ఆనంద దీపావళి కావాలి.రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.- తెదేపా అధినేత చంద్రబాబు