ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను వెలుగులోకి తెస్తున్న మీడియాపై జగన్ ప్రభుత్వం అసహనంతో వ్యవహరిస్తోందని ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. మీడియాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ.... ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మందడం పాఠశాలలో తరగతి గదులను పోలీసులు ఆక్రమించిన విషయాన్ని బయటి ప్రపంచానికి మీడియా చూపించడం తప్పా అని నిలదీశారు. విద్యార్థులను బయటకు పంపడంపై మీడియాకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా...విధి నిర్వహణలో భాగంగానే విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాఠశాలకు వెళ్లారని చెప్పారు. అక్కడ తరగతి గదుల్లో ఆరేసిన పోలీసుల దుస్తులను ఫొటోలు తీసి....వాటినే ఛానళ్లలో ప్రసారం చేశారని తెలిపారు.. దీనిపై అక్కసుతోనే ముగ్గురు విలేకరులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. జర్నలిస్టులపై నిర్భయ కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట అని అన్నారు.
నియంత పోకడలను ఖండిస్తున్నాం
మీడియా గొంతు నులిమే నియంత పోకడలను ఖండిస్తున్నామన్నారు. గత 8 నెలలుగా రాష్టంలో సీఎం జగన్ నిరంకుశ పాలన చేస్తున్నారని ఆక్షేపించారు. మీడియాపై రాష్ట్ర ప్రభుత్వ అణిచివేత చర్యలను గర్హిస్తున్నామన్నారు. అధికారం చేపట్టగానే ముగ్గురు మంత్రులు సమావేశం పెట్టి మరీ ఎంఎస్‌వోలను బెదిరించారని ఆరోపించారు. రెండు ఛానళ్లను ప్రసారం చేయరాదని రెండో నెల నుంచి ఆంక్షలు పెట్టారని తెలిపారు. అసెంబ్లీ ప్రసారాలు చేయకుండా 3 ఛానళ్లపై నిషేధం విధించారని గుర్తుచేశారు. జీవో 2430 తెచ్చి మీడియాపై ఉక్కుపాదం మోపారని ధ్వజమెత్తారు. మీడియాపై దౌర్జన్యాలు చేసిన వైకాపా నేతలను ఏం చేశారని ప్రశ్నించారు.
విలేకరి హత్యపై చర్యలేవీ..?
తునిలో విలేకరి హత్య, చీరాలలో విలేకరిపై హత్యాయత్నం, నెల్లూరులో ఎడిటర్‌పై వైకాపా ఎమ్మెల్యే దౌర్జన్యంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియా మనుగడకే ప్రభుత్వం ముప్పు తెచ్చిందని వ్యాఖ్యానించారు. జగన్ నియంత పోకడలు, తిక్క చేష్టలతో ఏపీకి అప్రదిష్ట తెస్తున్నారన్న ఆయన....ప్రభుత్వ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు.