పార్టీ కోసం కష్టపడేవారిని విస్మరించే అవకాశం లేదని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎదుటివారికి సమాధానం చెప్పగలిగే వారిని గుర్తింపునిస్తూనే, అడ్డగోలుగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే అంతర్గత విభేధాలు విడిచిపెట్టాలని కోరారు. ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయన్న తెదేపా అధినేత... ఉన్నవాటిని త్వరలోనే పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. పార్టీ సంస్థాగత తీర్మానంపై జరిగిన చర్చలో తెలుగు రాష్ట్రాల నేతలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఇన్ఛార్జ్లు లేని నియోజకవర్గాలకు నేతలను నియమించుకోవటం, పార్లమెంటు కమిటీల నియామకం త్వరలోనే పూర్తి చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు సూచించారు. అనుబంధ సంఘాలను జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
అధికారంలో ఉన్నపుడు ప్రజల కోసం ఆలోచించిన సమయంలో.. 10 శాతం పార్టీ కోసం పెట్టినా ఈ రోజు ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని... చంద్రబాబు వ్యాఖ్యానించారు. దుర్మార్గుల మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నందున... ప్రత్యర్థి నాయకులతో పాటు పోలీసులపైనా ఎదురు కేసులు పెడదామని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఎలాగో... ఎదురు కేసులే వీరికి వ్యాక్సిన్ అన్నారు. చట్టాన్ని సమర్ధవంతంగా ఉపయోగించి తప్పు చేసినవారికి చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ ఏర్పడి వచ్చే మార్చి నాటికి 40 సంవత్సరాలు పూర్తవుతుందన్న చంద్రబాబు... విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో తెదేపా పాత్ర కనిపిస్తోందని, ఏపీలో అలాంటి స్థానం కోసం అనునిత్యం శ్రమించామన్నారు. ఇందిరాగాంధీ లాంటి మహామహుల్ని ఎదురొడ్డి నిలబడిన పార్టీ తెదేపా అని గుర్తుచేశారు. 70 లక్షల కార్యకర్తలు కలిగిన తెదేపా... ఏకాకి కాదని సంస్థాగత శక్తి అని ఉద్ఘాటించారు. సంవత్సరం పాటు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. రెండేళ్లుగా కరోనా వేధిస్తున్నా.. సాంకేతికతను వాడుకుంటూ కార్యక్రమాలను సమర్థవంతంగా పార్టీ నిర్వహిస్తోందని చంద్రబాబు ప్రశంసించారు.