రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉండటం విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుపై మరింత భారం మోపుతోందని దుయ్యబట్టారు.
'వరుస విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతే.. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో బైఠాయించే వరకు పంటబీమా ప్రీమియం కట్టకపోవటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పరిహారం అడిగితే సభలో తెదేపా సభ్యులపై దాడికి తెగబడ్డారు. ఇకనైనా తీరు మార్చుకుని పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలి. పంట కొనుగోళ్లలో అవినీతికి స్వస్తి చెప్పి రైతు బకాయిలను తక్షణమే చెల్లించాలి. విపత్తు పరిహారం, బీమా, ఇన్ పుట్ సబ్సిడీలు సకాలంలో అందించి రైతులలో భవిష్యత్తుపై భరోసా పెంచాలి. అన్నంపెట్టే రైతన్నలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది తెదేపా ఆకాంక్ష.'- చంద్రబాబు