సీఎం అసమర్థత వల్లే బీసీ రిజర్వేషన్లు తగ్గుతున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. బీసీ వర్గాలపై కక్షతోనే ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేసు వేసిన వ్యక్తులు వైకాపాకు చెందిన వారని చంద్రబాబు ఆరోపించారు. బీసీల కేసుపై ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని నిలదీశారు. బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకు ఎందుకు వెళ్లట్లేదో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ పలుసార్లు దిల్లీ వెళ్లారు.. కానీ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు.
వెనుకబడిన వర్గాలకు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని... తెదేపా స్థాపించాక బీసీలను పైకి తెచ్చేందుకు కృషి చేశామన్నారు.ఎస్సీ, ఎస్టీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు వస్తాయన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను 25 ఏళ్లు కాపాడమని చంద్రబాబు అన్నారు. ఈ రిజర్వేషన్ల వల్ల అనేక బీసీ కులాలు రాజకీయంగా ఎదిగాయన్నారు. 60.55 రిజర్వేషన్లకు అనుకూలంగా 2013లో సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.