Chandra Babu Naidu Tweet: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మార్గంలో గోడలపై ఉన్న హిందూ దేవుళ్ల చిత్రాలను తొలగించి.. వైకాపా రంగులు వేయడం హిందూ మతాన్ని అవమానపరచడమేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘హిందుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని జగన్ చేస్తున్న పనులపై భక్తులు ఆగ్రహంగా ఉన్నారని బుధవారం ట్విటర్‌లో మండిపడ్డారు. రంగులు వేయక ముందు గోడపై హిందూ దేవుళ్ల చిత్రాలు ఉన్న ఫొటో, పార్టీ రంగులు వేసిన తర్వాత ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు.
* అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు డైరెక్టర్ డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెల మృతి కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. సాయం అందించడంలో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందు ఉండే నాగేంద్ర కుటుంబానికి ఇలా జరగడం విచారకరమని పేర్కొంటూ బుధవారం ఆయన ట్వీట్ చేశారు.
* ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం విచారకరమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఈ బాధ నుంచి బయటపడేలా కృష్ణ కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యం అందించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.
వైకాపావాళ్లు దిగజారి ప్రవర్తిస్తున్నారు: అచ్చెన్నాయుడు
వైకాపా నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీబీఐ, ఈడీ కేసులు, న్యాయస్థానం చీవాట్లపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ నేతలు నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘తమ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతాం. అధికార పార్టీ నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే రాజకీయాల్లో ఉండే అర్హతను సైతం కోల్పోతారు’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.