పోలవరం నిర్మాణంపై మాట్లాడుతున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని తాము అడుగుతుంటే, ప్రభుత్వం తమపై బురదజల్లాలని చూస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు తమ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, తెదేపాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుని, సహాయ పునరావాసం, భూసేకరణ పనుల్ని ప్రభుత్వం ఎప్పటికి పూర్తి చేస్తుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు.
అలా ఎలా ఇస్తారు?
ఎప్పటిలోగా పోలవరం పూర్తి చేస్తారో సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తారా? లేదా? అని ప్రశ్నించారు. నీళ్లు లేకుండా పవర్ ప్రాజెక్టు ఎందుకని నిలదీశారు. పోలవరంపై అవినీతి అని తమపై ఆరోపణలు చేసి మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు అదనపు పనులు కూడా కలిపి ఎలా ఇస్తారని నిలదీశారు.
ఏమైనా పర్వాలేదనే నీచ రాజకీయాలు
'రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి పెద్దమొత్తంలో నష్టం చేకూర్చారు. నాడు తాము వేసిన అంచనాలను తప్పు పట్టి, ఇప్పుడు అవే అంచనాలు చెబుతున్నారు. తనలాగే అందరూ అవినీతిపరులు అనే రీతిలో జగన్ అందరికీ అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరంపై తప్పుడు సమాచారంతో కాలయాపన చేస్తూ..., అవగాహన రాహిత్యంతో ప్రాజెక్టుకు ఏమైనా పర్వాలేదనే నీచ రాజకీయాలు చేస్తున్నారు.' అని చంద్రబాబు విమర్శించారు.
నిర్మాణ బాధ్యతలు అందుకే తీసుకున్నాం
దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ పనులు అక్కడే ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆ విధంగా కాకూడదనే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నాటి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది కాబట్టే పోలవరం పనులు 70శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో జగన్ ప్రభుత్వం ఏం చేయలేదని, కనీసం రోడ్లకు గుంతలు వేయలేకపోతున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు.
వైఎస్సార్ విగ్రహం ఎలా పెడతారు?
ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో వైఎస్ విగ్రహంపై పెడుతున్న శ్రద్ధ.. ప్రాజెక్టుపై పెట్టడం లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. కేంద్ర నిధులతో పోలవరం నిర్మాణం చేస్తే.. వైఎస్సార్ విగ్రహం పెడతారాని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే డబ్బులపై పెత్తనం చేస్తూ వైఎస్సార్ విగ్రహం ఎలా పెడతారని నిలదీశారు. ఇదంతా కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అని మండిపడ్డారు. కేంద్రం నిధులివ్వకుంటే.. వైఎస్సార్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఓ కారణం అవుతుందన్నారు.
గతంలో పరిహారం పొందిన పోలవరం నిర్వాసితులకు కూడా ఎకరా 10 లక్షల మేర పరిహరం అందజేస్తామని చెప్పిన దాని సంగతేంటని చంద్రబాబు అన్నారు. గోదావరి నీళ్లు తెలంగాణ భూభాగం మీదుగా శ్రీశైలం తెస్తామని సీఎం జగన్ చెబితే.. అది కుదరని పని అని ఆనాడే చెప్పినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్రంతో పోలవరం నిర్మాణంపై ప్రకటన ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరంలో ఏ దాపరికం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్తుంటే నేతలను అరెస్ట్ చేయడం తగదన్నారు. అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. స్పీకర్ తమ్మినేని అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
" పోలవరం గుత్తేదారును రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు. పోలవరంలో కొత్త గుత్తేదారును ఎందుకు తీసుకొచ్చారు. ఆర్‌అండ్ఆర్ ఇవ్వకుండా విద్యుత్ ప్లాంటు ఎందుకు. పోలవరంలో ఏడాదిన్నరగా మీరు చేసింది ఏమిటి. గతంలో, ఇప్పుడు మీరు చేసిన ప్రకటనల్లో ఏది నిజం. పోలవరంలో అవినీతి అన్నారు.. ఎందుకు రుజువు చేయలేదు. అవినీతి ఆరోపణలు చేసి మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులెలా ఇస్తారు?" - చంద్రబాబు
కావాల్సిన వాళ్లకే పనులు
పోలవరం ప్రాజెక్టు విషయంలో తెదేపా ఎప్పుడూ రాజీపడలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో తాము గుత్తేదారుని మారిస్తే, వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని రద్దు చేసి, వాళ్లకు కావలసిన వారికి పనులు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. ఆ సంస్థకు పరోక్షంగా లబ్ధి చేకూర్చడం ద్వారా ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు.
కేసీఆర్ ప్రకటనను ఎందుకు ఖండించలేదు
తెదేపా హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి, ఆర్అండ్ఆర్కి, భూసేకరణకి అయ్యే మొత్తం ఖర్చుని కేంద్రమే భరించేలా ఒప్పించామని చంద్రబాబు తెలిపారు. అప్పట్లో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నితిన్‌గడ్కరీ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చి స్వయంగా ఆ విషయం చెప్పారన్నారు. అప్పుడులేని సందిగ్ధత ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు జగన్ అంగీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి అసెంబ్లీలో ప్రకటించినా... ఎందుకు ఖండించలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఈ విషయాలన్నీ తమ సభ్యులు అడిగితే సమాధానం చెప్పకుండా సభ నుంచి బహిష్కరించారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సభ్యత, సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'అమూల్ రాకతో మరో పాల విప్లవం మొదలవుతుంది'