‘పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు విపక్ష నేతగా పనిచేశా. నాకిప్పుడు కొత్తగా పదవి కావాలా? నా ఆవేదనంతా రాష్ట్రం గురించే. ఇంతటి విధ్వంసకర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. రెండున్నరేళ్లలోనే అప్రతిష్ఠపాలైన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘తుగ్లక్ గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు జగన్‌ను చూస్తున్నాం. అప్పుడు ఆయన జుత్తుపై పన్నేస్తే.. ఈయన చెత్తపై వేశారు’ అని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన పామూరు మండల వైకాపా కన్వీనర్, మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రి సహా ఆ పార్టీకి చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. తెదేపా కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో 10-12 మంది ముఖ్యమంత్రులను చూశా. ఇప్పుడున్నంత అవినీతి, విధ్వంసకర ప్రభుత్వాన్ని, అసంబద్ధ నిర్ణయాలను ఎప్పుడూ చూడలేదు’ అని మండిపడ్డారు.
25ఏళ్లు తాగిస్తారన్నమాట!
‘మద్యనిషేధమని ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో భవిష్యత్తులో మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి అప్పులు తెస్తున్నారు. అంటే మీకు ఇష్టం లేకపోయినా అప్పులు కట్టడానికి 25ఏళ్లపాటు మీతో తాగిస్తారన్న మాట’ అని చంద్రబాబు వివరించారు. ‘కాకినాడ తీరంలో బోటును ఎందుకు తగలబెట్టారో విచారించాలని ధూళిపాళ్ల నరేంద్ర కోరితే పోలీసులు ఆయన ఇంటికెళ్లి నోటీసునిచ్చారు. దొంగలను, స్మగ్లర్లను పట్టుకోలేరుగానీ ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ‘తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తే వెలుగొండను పూర్తిచేసి మీ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఇప్పటికే నీళ్లిచ్చేవాళ్లం’ అని పేర్కొన్నారు.