ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీలా పడ్డ టీ-కాంగ్రెస్​కు.. రేవంత్ టీం దిక్సూచిగా మారేనా? - challenges to revanth reddy

తెలంగాణ పీసీసీ నూతన కార్యవర్గానికి పార్టీలో పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న పార్టీని ప్రక్షాళన చేసే దిశలో నూతన కార్యవర్గం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. వరుస ఓటమిలతో డీలా పడ్డ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి...క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుని అధికార తెరాసను, భాజపాలను దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాల్సి ఉంది. మరొకవైపు నూతన పీసీసీ కార్యవర్గానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తొలి సవాల్​గా​ నిలువనుంది.

tpcc revanth reddy
రేవంత్ రెడ్డి

By

Published : Jun 28, 2021, 8:08 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కొత్త కార్యవర్గం సవాళ్లపై నడక సాగించాల్సి ఉంది. వరుస ఓటములతో పాటు పలువురు ముఖ్య నాయకులు పార్టీని వీడటం వంటి సమస్యలతో కాంగ్రెస్‌ రాష్ట్ర కేడర్‌ సతమతమవుతోంది. పలు నియోజకవర్గాలు, జిల్లాల్లో నాయకత్వ సమస్య తీవ్రంగా ఉంది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లో ఓటమితో పాటు లోక్‌సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల కోటాలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ వెనుకబడింది. వరుస పరాజయాలతో క్షేత్రస్థాయి నాయకత్వం డీలాపడగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందర్నీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికార తెరాసతో పాటు భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు కొత్త కార్యవర్గానికి కీలకం కానున్నాయి.

కార్యవర్గంపై దృష్టి..

2018 శాసనసభ ఎన్నికల్లో నెగ్గిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో ముగ్గురు మహిళా నేతలు కాంగ్రెస్‌ను వీడి తెరాస, భాజపాల్లో చేరారు. మాజీ మంత్రి డీకే అరుణ భాజపాలో చేరగా, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరి మంత్రి అయ్యారు. మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెరాసలో చేరి రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

వరుస ఎన్నికలు, పరాజయాల నేపథ్యంలో పలువురు నాయకులు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. 150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో కేవలం మూడు డివిజన్లకు పరిమితమైంది. గ్రేటర్‌ పరిధిలోని పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఇతర పార్టీల్లో చేరారు. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా లేరు. రాష్ట్రస్థాయితో పాటు జిల్లా స్థాయుల్లో పలుచోట్ల పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలున్నాయి. నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు నేతల మధ్య సమన్వయం సాధించడంపైనా కొత్త కార్యవర్గం దృష్టి సారించాల్సి ఉంది.

ఉపఎన్నిక సవాల్..

రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని పీసీసీ కొత్త కార్యవర్గానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తొలి సవాల్‌ కానుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. కొత్త నాయకత్వం ఈ స్థానం నుంచి పార్టీ అభ్యర్థికి డిపాజిట్‌లు దక్కించుకోవాలని పార్టీ ఎంపీ, ముఖ్య నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. హుజూరాబాద్‌ను తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుండగా, భాజపాలో చేరిన ఈటల రాజేందర్‌ బరిలో దిగనుండటంతో ఈ ఎన్నిక కాంగ్రెస్‌ కొత్త కార్యవర్గానికి కీలకం కానుంది.

ఇదీ చదవండి :

TPCC Revanth: 'స్వార్థ రాజకీయాల కోసం ప్రేమ చూపిస్తున్నారు'

యూఏఈలోనే టీ20 ప్రపంచకప్.. గంగూలీ వెల్లడి​

ABOUT THE AUTHOR

...view details