మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని భూమ్మీద లేకుండా చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో దిశ యాప్‌పై శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు.
‘అవుట్ ఆఫ్ ది లా వెళ్తేనే సమాజంలో సమాంతర న్యాయం జరుగుతుంది. మగవాళ్ల ఆలోచన విధానం మారాలి. ఎక్కడో ఒకచోట దీన్ని ఆపకపోతే న్యాయానికి అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ని మరోసారి అభినందిస్తున్నాను. మగవాడు సమాజానికి రక్షణ ఇవ్వాలి. మృగంలా మారి మృగాడిగా వ్యవహరిస్తే ఎలా..? వారిని క్షమించకండి. స్త్రీని అగౌరవపరిచి బలవంతం చేసినవాడు ఈ భూమ్మీద ఉండటానికి వీల్లేదు. చట్టాలు ఏం చేస్తాయో నాకు తెలియదు. అలాంటి సమాంతర న్యాయం జరిగినప్పుడే అసలైన శిక్ష పడుతుంది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఘటనతో ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు’ అన్నారు.