Central Govt On Polavaram:వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావడం కష్టమేనని కేంద్రం తేల్చిచెప్పింది. ఇప్పుడు జరుగుతున్న పనుల తీరు చూస్తే అనుకున్న లక్ష్యం మేర నిర్మాణం పూర్తికాకపోవచ్చని రాజ్యసభలో కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి స్పష్టం చేసారు. కొత్త షెడ్యూల్ ఖరారుకు 2021 నవంబర్‌లో కమిటీని ఏర్పాటు చేశామన్న ఆయన..ప్రాజెక్టు సాగునీటి పనులకు సవరించిన అంచనా వ్యయం 35వేల 950 కోట్లుగా ప్రకటించారు. దీన్నిబట్టి ప్రాజెక్ట్‌లో తాగునీటి విభాగం కింద పెద్దఎత్తున నిధుల కోత విధించినట్లు తెలుస్తోంది.
ప్రాజక్టు నిర్మాణ పనుల్లో ఆలస్యం జరుగుతోందని అంగీకరించిన కేంద్రం..సాంకేతిక కారణాలతో పాటు కరోనా కూడా నిర్మాణ పనులపై ప్రభావం చూపిందని తెలిపింది. 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అది సాధ్యపడటం లేదని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర టుడు లిఖితపూర్వక జవాబిచ్చారు.
పోలవరం సవరించిన అంచనాలపై సోమవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ ఈ మేరకు సమాధానమిచ్చారు. 2017-18 ధరల ప్రకారం 55 వేల548 కోట్లు పోలవరం సాగునీటి ప్రాజెక్టు రెండో సవరించిన అంచనాలకు 2019 ఫిబ్రవరిలో జల్‌శక్తి శాఖ ఆమోదం తెలిపిందన్నారు. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2020 మార్చిలో నివేదిక ఇచ్చిందని. .దీని ప్రకారం 35,950 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపిందన్నారు. పీపీఏ సిఫార్సు తర్వాత దానికి పెట్టుబడుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 2014 ఏప్రిల్ 1 నాటికి.. సాగునీటి విభాగం మిగిలిన భాగం నిర్మాణానికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే నూరు శాతం సమకూర్చాల్సి ఉందని కేంద్ర మంత్రి టుడూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామన్నారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకూ 11,600 కోట్లు చెల్లించామన్నారు. ఇంకా 711 కోట్ల చెల్లింపులకు పీపీఏ, సీడ్లూసీ సిఫార్సు చేశాయని రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి సమాధానమిచ్చారు. కోవిడ్‌తో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, దిగువ కాఫర్ డ్యామ్‌లకు చెందిన గ్యాప్-1, గ్యాప్-2ల్లో లోతుగా కోతపడటం, సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడంలో జాప్యం వంటివి పోలవరం నిర్మాణంపై ప్రభావం చూపాయని కేంద్రమంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వం చెప్పిన ప్రకారం ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే, ఎగువ కాఫర్ డ్యాం, కాంక్రీట్ డ్యాం , డయాఫ్రం వాల్‌కు చెందిన ఎర్త్ కం రాక్ ఫిల్‌డ్యాం నిర్మాణం పూర్తయినట్లు బిశ్వేశ్వర్ టుడూ తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ నిధుల విషయంలో కేంద్రం మళ్లీ పాతపాటే పాడుతోంది. 2017-18 ధరల ప్రకారం 47,725.74 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.... సాగునీటి విభాగం కింద 35,950.16 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని రాజ్యసభలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర టుడూ ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఫార్సు అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీన్నిబట్టి తాగునీటి విభాగం కింద 7,214.67 కోట్లు, విద్యుత్ కేంద్రం ఖర్చుల కింద 4,560.91 కోట్లు మినహాయించినట్లు అర్థమవుతోంది. విద్యుత్ కేంద్రం నిధులు రాష్ట్రమే భరించాలని ఎప్పటి నుంచో కేంద్రం చెబుతున్నా..తాగునీటి విభాగం కింద పెద్దమొత్తంలో నిధుల కోత విధించడంతోనే పేచీ ఏర్పడింది. జాతీయ ప్రాజెక్ట్ మార్గదర్శకాల ప్రకారం సాగు, తాగు నీటికి అయ్యే ఖర్చు కేంద్రమే ఇవ్వాలని ఇప్పటికీ పలుమార్లు రాష్ట్ర అధికారులు విన్నవించారు. కేంద్ర జలసంఘం నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నా..కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందోనన్న చర్చ సాగుతోంది.
క్రమం తప్పకుండా సందర్శన..