ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Power Purchase : కరెంటు...ఎక్కడైనా కొనచ్చు.. - ap discom

కరెంటును స్వేచ్ఛగా ఎక్కడైనా కొనుక్కునేందుకు కేంద్రం వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పిస్తోంది. రోజుకు ఒక మెగావాట్‌కు పైగా కరెంటు వాడుకునే పెద్ద వినియోగదారులపై 'రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ'(డిస్కం)లు వేసే ఆర్థికభారం తప్పించేందుకు కొత్తగా విద్యుత్‌ నియమావళి ముసాయిదాను అన్ని రాష్ట్రాల విద్యుత్‌ శాఖలకు పంపింది.

Power Purchase
కరెంటు...ఎక్కడైనా కొనచ్చు..

By

Published : Sep 5, 2021, 10:38 AM IST

కొత్త విద్యుత్‌ నియమావళి ముసాయిదా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, డిస్కంల అభిప్రాయాలను ఈ నెల 15లోగా పంపాలని కేంద్ర విద్యుత్‌ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ గడువు ముగిశాక కేంద్రం కొత్త నియమావళిని అమల్లోకి తెస్తూ తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. ఇది అమల్లోకి వస్తే డిస్కంల ఆదాయం మరింత పడిపోతుందని అధికార వర్గాల అంచనా. ఈ ముసాయిదాలో పలు అంశాలు రోజూ ఎక్కువగా కరెంటు వినియోగించే పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయి.

ఇందులో ముఖ్యాంశాలు..

దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సౌర, పవన విద్యుత్‌ వంటి ‘సంప్రదాయేతర ఇంధన’ (రెన్యూవబుల్‌ ఎనర్జీ-ఆర్‌ఈ) ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచాలని ‘గ్రీన్‌ ఎనర్జీ’ విధానం కింద కేంద్రం ప్రోత్సహిస్తోంది. 2022 చివరికల్లా దేశంలో లక్షా 75 వేల మెగావాట్ల ఆర్‌ఈ ఉత్పత్తి జరగాలని ప్రధాని మోదీ ఐదేళ్ల క్రితం లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికే ఆర్‌ఈ ప్లాంట్ల స్థాపిత ఉత్పాదక సామర్థ్యం లక్ష మెగావాట్లకు చేరింది. ఈ కరెంటు అతి తక్కువగా యూనిట్‌ రూ.3 కే పలు రాష్ట్రాల్లో కొత్త ఆర్‌ఈ కేంద్రాలిస్తున్నాయి. దీనికి డిమాండు పెంచేందుకు ‘గ్రీన్‌ ఎనర్జీ స్వేచ్ఛాయుత కరెంటు కొనుగోలు’ (ఓపెన్‌ యాక్సిస్‌) విధానం తెస్తున్నట్లు ముసాయిదాలో తెలిపింది.

ఓపెన్‌ యాక్సిస్‌ అంటే రోజుకు మెగావాట్‌ (అంటే దాదాపు 24 వేల యూనిట్లు) వాడే వినియోగదారులు డిస్కం నుంచే కాకుండా బయట ఎక్కడైనా కరెంటు కొనుక్కోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పలు పరిశ్రమల వినియోగదారుల నుంచి విద్యుత్ డిమాండ్ బాగానే ఉంది.

గ్రీన్‌ ఎనర్జీ విధానం కింద పెద్ద వినియోగదారులు డిస్కంలతో సంబంధం లేకుండా బయట సౌర, పవన విద్యుత్కేంద్రాల నుంచి నేరుగా కరెంటు కొనుగోలు చేసుకోవచ్చని తాజా నియమావళిలో కేంద్రం తెలిపింది. వారి నుంచి కేవలం లైన్ల కిరాయి మాత్రమే తీసుకుని ఆ సౌర, పవన కేంద్రాల నుంచి విద్యుత్‌ను సరఫరా చేయాలని డిస్కంలకు సూచించింది. ఇలా కొనుక్కోదలచిన వినియోగదారులు నేరుగా ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు. కేంద్రం ఏర్పాటుచేసే జాతీయ నోడల్‌ సంస్థ అనుమతిస్తుంది. అప్పుడిక డిస్కంలు కాదనకుండా లైన్ల ఛార్జీలనే తీసుకుని వారు కొన్న విద్యుత్కేంద్రం నుంచి కరెంటు సరఫరా చేయాలి.

ఓపెన్‌ యాక్సిస్‌లో కొనేవారి నుంచి డిస్కంలు ఎంత ఛార్జీ వసూలు చేయాలనేది ఈ నియమావళి అమల్లోకి వచ్చిన 4 నెలల్లో నిర్ణయించాలని కేంద్రం ఆదేశించింది.

పరిశ్రమలే కాకుండా గేటెడ్‌ కమ్యూనిటీలు, భారీ అపార్టుమెంట్లలో నివసించే సాధారణ ప్రజలు కూడా అన్ని ఇళ్లలో కలిపి రోజుకు మెగావాట్‌కు మించి వినియోగముంటే వారు కూడా కామన్‌ మీటర్‌ పెట్టుకుని ఓపెన్‌ యాక్సిస్‌కు వెళ్లవచ్చు. రోజుకు మెగావాట్‌ అనే పరిమితిని కూడా తగ్గించాలనే యోచనలో కేంద్రం ఉంది.

డిస్కంలకు మరింత నష్టం..

పరిశ్రమల కరెంటు కనెక్షన్ల నుంచే డిస్కంలకు 60 శాతానికి పైగా ఆదాయం వస్తుంది. వారు ఓపెన్‌ యాక్సిస్‌లోకి వెళ్లిపోతే డిస్కంల కరెంటు అమ్మకాలు, ఆదాయం పడిపోయి నష్టాలొస్తాయి. ఎందుకుంటే 50 యూనిట్లలోపు వాడే లక్షలాది కుటుంబాలకు యూనిట్‌ కరెంటును 1.45కి ఇస్తున్న డిస్కంలు అదే యూనిట్‌కు పరిశ్రమల నుంచి రూ.8 నుంచి 10 దాకా వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఒక యూనిట్‌ కరెంటు సగటు సరఫరా వ్యయం రూ.7.10 వరకూ ఉందని డిస్కంల అంచనా. వ్యవసాయానికి ఉచితంగా, ప్రజలకు అంతకన్నా తక్కువకు ఇస్తూ తమ వద్ద ఎక్కువ వసూలు చేస్తున్నారని పరిశ్రమలు ఓపెన్‌ యాక్సిస్‌లోకి వెళ్లి బయట విద్యుత్కేంద్రాల్లో తక్కువకు కొంటున్నాయి. పరిశ్రమలు ఇలా ఎక్కువ సంఖ్యలో బయటికి వెళ్లిపోతే నష్టానికి సరఫరా చేస్తున్న ప్రజల కనెక్షన్లే డిస్కంలకు మిగిలి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తాయని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి :'మూడేళ్లలోపు తీర్పు రాకపోతే న్యాయాన్ని తిరస్కరించినట్లే'

ABOUT THE AUTHOR

...view details