రుణాల(loans) కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేస్తూ తాఖీదు పంపింది. ఒక వైపు రుణ పరిమితిని పెంచాలని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.42,472 కోట్ల బహిరంగ మార్కెట్టు రుణంగా తొలుత లెక్కతేల్చినా ఇప్పుడు అందులో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు భారీ కోత పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్టు రుణ పరిమితిని రూ.27,668 కోట్లుగా నిర్ధారించి ఆ విషయాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌కు తెలియజేస్తూ కేంద్ర ఆర్థికశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ అగర్వాల్ లేఖ పంపారు.
అప్పుల కథ తెలుసుకుని మరీ..
రాష్ట్రం నికర రుణ పరిమితి లెక్కలు తేల్చేందుకు గత కొన్నేళ్లుగా తీసుకున్న రుణాలపై సమగ్ర నివేదిక పంపాలని ఈ ఏడాది మార్చిలోనే కేంద్రం కోరింది. ఆ వివరాలన్నీ సమర్పించిన తర్వాత పరిమితి ఎంత ఉందో చెబుతామని స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్‌లో ఆర్థికశాఖ అధికారులు ఆ వివరాలన్నీ కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. ఆ లెక్కలన్నీ పరిశీలించిన కేంద్రం.. రుణ పరిమితిలో భారీ కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.27,668 కోట్లకే రుణాన్ని పరిమితం చేసింది. పెట్టుబడి వ్యయం కోసం మొత్తాన్ని ఖర్చు చేశాక మరో 0.5% మేర రుణ పరిమితి పెంచుతామని షరతు విధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి రూ.10,61,802 కోట్లుగా ఆర్థిక సంఘం లెక్కలు వేసింది. అందులో 4% మేర ఈ ఏడాది రాష్ట్రం అప్పులు చేసుకునేందుకు వీలుంటుందని తేల్చింది. ఆ లెక్కన రూ.42,472 కోట్లు రాష్ట్రం అప్పు తీసుకోవచ్చని లెక్కలు కట్టింది. ఇందులో మూలధన వ్యయం కింద రూ.27,589 కోట్లు ఖర్చు చేయాలంది. అలా చేస్తేనే రుణ పరిమితి మరో 0.5% ఇస్తామని పేర్కొంది. మూలధన వ్యయం ఆ మేర చేశారో లేదో లెక్కించే వరకూ 0.5%... అంటే రూ.5,309 కోట్ల మేర కోత పెడుతున్నట్లు పేర్కొంది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ రుణ పరిమితి రూ.37,163 కోట్లకు పరిమితమైంది. అయితే, రుణాలు తిరిగి చెల్లించడంతో రూ.14,429 కోట్ల అదనపు వెసులుబాటు వచ్చింది. అప్పుడు నికర రుణపరిమితి రూ.51,592 కోట్లకు చేరింది.
రూ.17,924 కోట్ల అప్పు ముందే చేసేసి..