అమరావతి కోసం 42వ రోజూ ఆందోళనలు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. మండలిని రద్దు చేస్తూ సోమవారం శాసనసభలో తీర్మానం చేయడంపై భగ్గుమన్న రైతులు... వైకాపా సర్కారు కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపి తమకు బాసటగా నిలిచిందనే అక్కసుతోనే.. మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారని రైతులు, మహిళలు ఆక్షేపించారు.
తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన మహిళలు, రైతులు ....వైకాపా సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరులో రైతుల ధర్నాకు పలువురు సంఘీభావం తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అణచివేయాలని చూస్తే....ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.