Amaravathi News: కొత్త రాజధానిలో సంస్థల ఏర్పాటు బాధ్యత కేంద్రానిది కాదా? - central government negligence on the capital Amravati
Negligence on Capital Amravati: రాజధాని అమరావతిపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్థలాలు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 18 ప్రభుత్వ రంగ విభాగాలు భూములు తీసుకోగా.. కేవలం ఒక్కటంటే ఒక్కటే అమరావతిలో నిర్మాణం మొదలుపెట్టింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయ భవనాల నిర్మాణంపై తాత్సారం
By
Published : Mar 10, 2022, 4:09 AM IST
రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లవుతున్నా రాష్ట్రంలో ఉండాల్సిన చాలా కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాలు ఇంతవరకూ ఏర్పాటు కాలేదు. రాజధాని అమరావతిపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అమరావతిలో తమ విభాగాలు, సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టకుండా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. రాజధానిలో పలు కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు సీఆర్‌డీఏ 2016-19 మధ్యలోనే భూములు కేటాయించింది. వాటిలో చాలా సంస్థలు భూమి ధరనూ చెల్లించాయి.
కానీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) తప్ప మరే ఇతర సంస్థా నిర్మాణాలు మొదలుపెట్టలేదు. వైకాపా అధికారంలోకి వచ్చి, రాజధాని పనులు నిలిపివేసిన తర్వాత... భూములు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక్కటీ అటువైపు చూడలేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) తుళ్లూరు-రాయపూడి మధ్య తమకు కేటాయించిన స్థలానికి ఇటీవల ప్రహరీ నిర్మించింది. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిలో తమ సంస్థల కార్యాలయాల నిర్మాణాల్ని మొదలుపెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కేంద్రానికి బాధ్యత లేదా?
అమరావతి నిర్మాణానికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే శంకుస్థాపన చేశారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర పాలన అమరావతి నుంచే సాగుతోంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు చేపట్టకపోవడమేంటి? కొత్త రాష్ట్ర రాజధానిలో తమ సంస్థలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్రం 2018లో సెంట్రల్ సెక్రటేరియేట్ విధానం తీసుకొచ్చింది. రాష్ట్రాల రాజధానుల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని ఒకేచోట ఏర్పాటుచేయడం దీని లక్ష్యం. దీని కోసం సీపీడబ్ల్యూడీ.. సీఆర్‌డీఏ నుంచి 28 ఎకరాల స్థలం కోరింది.
సీఆర్‌డీఏ 22.5 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ పనులు మొదలుపెట్టలేదు సరికదా, 2022-23 బడ్జెట్‌లో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియేట్‌కి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ రూ.లక్ష మాత్రమే కేటాయింపులు చూపించింది. ఎన్‌ఐడీలాగే మిగతా సంస్థల కార్యాలయాల నిర్మాణాలూ మొదలుపెట్టకుండా.. మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఐడీ నిర్మాణమూ నత్తనడకనే సాగుతోంది. తాత్కాలికంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. 2016లో ఎన్‌ఐడీతో పాటే రాజధానిలో భూములు తీసుకున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎస్‌ఆర్‌ఎం, విట్ ఐదేళ్ల కిత్రమే తరగతులు ప్రారంభించడం గమనార్హం.
ఇచ్చినదెంత.. చెప్పేదెంత?
అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది రూ.1,500 కోట్లే. విజయవాడ, గుంటూరు నగరాలకు ఇచ్చిన రూ.1,000 కోట్లనూ కలిపి రాజధానికి రూ.2,500 కోట్లు ఇచ్చినట్టు చెబుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చాక... అమరావతి నిర్మాణానికి నిధులు కావాలని గానీ, కేంద్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేయాలని గానీ కోరకపోవడం, మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడంతో కేంద్రం కూడా మౌనం వహించింది. కానీ పునర్విభజన చట్టం ప్రకారం ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుందని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో కేంద్రప్రభుత్వం తన బాధ్యతను విస్మరించేందుకు వీల్లేదు. స్థలాలు తీసుకున్న సంస్థల కార్యాలయ భవనాల నిర్మాణం వెంటనే మొదలుపెట్టడంతో పాటు, ఇతర కేంద్రప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నీ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
అమరావతిలో 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాల్ని సీఆర్‌డీఏ కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్ల చొప్పున, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా, కొన్నింటికి తక్కువ ధరకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది.
గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలన్నీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత వాటిని ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాలి. కానీ కేంద్రం ఆ బాధ్యతను విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.