రాజాధానిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు తుళ్లూరు దీక్షా శిబిరంలో మహిళా రైతులు వినూత్న నిరసన తెలిపారు. మధ్యాహ్న సమయంలో ఖాళీ గిన్నెలను ముఖానికి అడ్డంపెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై మొండిగా వ్యవహరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి కనబడటం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు తుళ్లూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో అమరావతిని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ వధూవరులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
రాజధాని రైతులకు ఎమ్మార్పీఎస్ మద్దతు
మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు ఎమ్మార్పీఎస్ నేతలు మద్దతు పలికారు. వారికి సంఘీభావంగా దీక్షా శిబిరంలో రైతులతో పాటు కొద్దిసేపు కూర్చున్నారు. ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకు ఏప్రిల్ 8న భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నేతలు వెల్లడించారు. 87 రోజుల నుంచి మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
అన్యాయంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు
రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం సరికాదని వెలగపూడి దీక్ష శిబిరంలో రైతులు అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంత మహిళలు, రైతులపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని రైతులు స్పష్టం చేశారు. న్యాయస్థానాల ద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు
ఓడిపోతామనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు అమరావతిలో నిర్వహించడం లేదని రాయపూడి రైతులు అభిప్రాయపడ్డారు. రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా నిరంకుశ వైఖరితో ప్రభుత్వం ముందుకు వెళ్లడం సరికాదని రైతులు తెలిపారు. పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాల కేటాయింపు చేయడాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ దీక్ష కొనసాగిస్తామన్నారు.