ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల వివరాలను, సివిల్ అకౌంట్లను కాగ్(CAG) పరిశీలనకు పంపుతుంది. కాగ్‌లో అకౌంట్, ఆడిట్ అని రెండు విభాగాలు ఉంటాయి. వీటి పర్యవేక్షణలో ఏ నెలకు ఆ నెల ప్రభుత్వ బడ్జెట్ లెక్కలు, ఖర్చులను కాగ్ పరిశీలించి, సందేహాలను లేవనెత్తుతుంది. తుది వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. రాష్ట్రానికి తిరిగి పంపుతుంది. తాజాగా జూన్ లెక్కల పరిశీలన పూర్తయ్యాక ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సంబంధిత వివరాలతోపాటు ఒక లేఖ కూడా పంపారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా చేసిన ఖర్చుపై అందులో ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చూపకుండానే 22 అంశాలపై 30 వేల 919.08 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు. కొన్ని అంశాల్లో ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులకు మించి ఖర్చులు జరిగాయన్నారు. మొత్తం 548 అంశాలకు సంబంధించి పరిశీలన చేస్తే ఈ అంశం తేలిందన్నారు. ఏకంగా 3వేల 192.41 కోట్లను బడ్జెట్ కేటాయింపులకు మించి ఖర్చు చేశారని విశదీకరించారు. మరో 3వేల 179 అంశాల్లో అసలు ఎలాంటి ఖర్చులు చేయలేదన్నారు. ఆయా అంశాల్లో 50వేల 995.20 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉన్నా వాటికి సంబంధించి పైసా కూడా ఇంతవరకు ఖర్చు చేయలేదని గుర్తుచేశారు. ఈ నెలవారీ సివిల్ అకౌంట్ల పరిశీలన మరింత ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ ఇందుకు అవసరమైన సలహాలు కూడా రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి ఆహ్వానించారు.
రాష్ట్రంలో తాజా ఆర్థిక పరిణామాల నేపథ్యంలో కాగ్‌లోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం మరింత లోతుగా లెక్కలను పరిశీలిస్తోంది. అక్కడి నుంచి అనేక అభ్యంతరాలు రాష్ట్ర ఆర్థికశాఖకు నిరంతరం అందుతున్నాయి. వివిధ కార్పొరేషన్ల నుంచి స్వీకరించిన అప్పులు, తిరిగి చెల్లించేందుకు అనుసరిస్తున్న విధానాలు, ఎప్పటిలోగా తిరిగి చెల్లించగలరనే వివరాలపైనా కాగ్ ఆరా తీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతమేర కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి, ఎన్ని అప్పులు తీసుకుందో కూడా వివరాలు పంపాలని ఇప్పటికే కోరింది. గతంలో 41 వేల కోట్ల ఖర్చుకు సంబంధించి బిల్లులు, ఓచర్లపై ఆరా తీసిన కాగ్... ఆ విషయంలోనూ ఇంకా ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. తాజాగా రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు అదనపు ఎక్సైజ్ ఆదాయాన్ని ఎస్క్రో చేసి, తీసుకున్న రుణాలపైనా ఆరా తీసింది.
CAG REPORT: కేటాయింపు లేకుండా రూ.30,919 కోట్ల ఖర్చా? - రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులపై కాగ్ నివేదిక
రాష్ట్రంలో జూన్ వరకు ప్రభుత్వ ఖర్చులను పరిశీలించిన కాగ్(CAG)... అనేక ప్రశ్నలు లేవనెత్తింది. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చూపకుండానే 22 అంశాలపై 30 వేల 919.08 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి తెలియజేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులపై కాగ్ నివేదిక
Last Updated : Sep 17, 2021, 5:30 AM IST