ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం శిరోధార్యంగా భావించి పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీని కోసం మండలి బుద్ధప్రసాద్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేయడాన్ని తెలుగు జాతి మొత్తం వ్యతిరేకిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నా...అంటూ లేఖలో రాశారు.
తెలుగు-సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్,అధికారభాషా సంఘం అధ్యక్షుడు మినహా అందరు వ్యతిరేఖిస్తున్నారని గుర్తు చేశారు.అన్ని రాజకీయ పార్టీలు, పత్రిక, ప్రసార, సామాజిక మాధ్యమాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని.ప్రజాభిప్రాయాన్ని గమనించడానికి ఇంతకంటే వేరే మార్గం ఏముంది? అంటూ లేఖలో రాశారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నపుడు వాటిని వెనక్కి తీసుకుంటేనే ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందని బుద్ధప్రసాద్ అన్నారు.