వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడికి సంబంధముందని విజిలెన్స్ దర్యాప్తులో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు అచ్చెన్నాయుడిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అవినీతి జరిగినందునే అరెస్టు చేశామని వైకాపా నేతలు చెబుతుండటం దారుణమన్నారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్న బొండా ఉమా...ప్రభుత్వ వైద్యులపై దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల దాడులకు దిగారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొంత మంది నేతల హత్యకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలకు ప్రాణాలకు హానీ కలిగితే జగన్ ప్రభుత్వానిదే బాధ్యతవుతుందని హెచ్చరించారు. మంత్రులు హెచ్చరిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని ఆక్షేపించారు.