ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Liquor scam తెలంగాణలో అగ్గిరాజేసిన లిక్కర్​ స్కామ్ ఆరోపణలు, భాజపా శ్రేణుల ఆందోళనలు

Delhi Liquor scam రాష్ట్రంలో భాజపా, తెరాస మధ్య మళ్లీ వార్‌ మెుదలయ్యింది. లిక్కర్‌ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితపై కమలం నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా కార్యకర్తలు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని భాజపా నేతలు ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆందోళనలు చేయాలని శ్రేణులకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Delhi Liquor scam
లిక్కర్‌ స్కామ్

By

Published : Aug 23, 2022, 12:02 PM IST

లిక్కర్‌ స్కామ్

Delhi Liquor scam: దిల్లీ లిక్కర్‌ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలతో తెరాస, భాజపా మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కవిత ఇంటిని ముట్టడించేందుకు భాజపా నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న శ్రేణులపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కై.. బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. దాడిలో గాయపడ్డ వారికి చికిత్స అందించకుండా పోలీస్ స్టేషన్‌లో ఉంచడం హేయమైన చర్యని ఆరోపించారు. కేసులకు, తెరాస దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. భాజపా శ్రేణులపై దాడికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

భాజపా శ్రేణుల అరెస్ట్‌తో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ధ అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తక్షణమే కార్యకర్తలను విడుదల చేయాలని పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివచ్చారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించేందుకు సిద్ధమవ్వటంతో.... భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. భాజపా లీగల్‌ సెల్‌ నాయకులు స్టేషన్‌కు వచ్చి కేసుల నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత ఇంటి వద్ద నిరసనలో పాల్గొన్న ఆందోళనకారుల్లో 28 మందిని రిమాండ్‌కు తరలించనున్నట్లు సమాచారం.

కవితపై భాజపా నేతలవి నిరాధారమైన ఆరోపణలని తెరాస నేతలు కొట్టిపారేశారు. హైదరాబాద్‌లో గన్ పార్క్ ముందు తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కవిత ఇంటిపై దాడికి దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడికి దిగిన భాజపా నాయకులు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే... కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

భాజపా నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం పట్ల కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బండి సంజయ్‌కి పెద్దలు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్న్టలు సమాచారం. కేంద్ర నిఘావర్గాలు కూడా ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నాయి.



ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details