తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ విద్యాసంస్థ పురస్కారాన్ని అందుకుంది. మెరుగైన సాంకేతిక విద్యను అందిస్తున్నందుకు ఇంటర్నేషన్ బ్రాండ్ కన్సల్టింగ్ కార్పొరేషన్(ఐబీసీ) సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ ప్రతినిధిగా మల్లెల శివరాం పురస్కారం అందుకున్నారు.
గర్వంగా ఉంది
ఈ అవార్డు సాధించటం గర్వంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు తమ విజయాన్ని పెంచేందుకు ప్రేరణగా నిలిచాయని ఆర్జీయూకేటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీహరి అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించడం, గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం వల్ల గతంలోనూ ఎన్నో అవార్డులు ఆర్జీయూకేటీ సొంతం చేసుకుందని తెలిపారు.