జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు పాత నేరస్తులు హైదరాబాద్‌లో మరోసారి దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయారు. వేలి ముద్రల ఆధారంగానే నిందితులను పట్టుకోగలిగామని బాలానగర్ పోలీసులు తెలిపారు. రాజు కాలనీకి చెందిన అంజాద్ రెండేళ్ళున్నప్పుడు తల్లిదండ్రులు చనిపోవడంతో జరీనా బేగం అనే మహిళ అతడిని పెంచుకుంది. జల్సాలకు అలవాటు పడిన అంజాద్ స్నేహితుడు షారుక్‌తో కలిసి పెంచిన తల్లి మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. అనంతరం నగరంలోని ఏడు ఇళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకు దొరికిపోయారు.
దొంగతనం చేసినందుకుగాను తొమ్మిది నెలలు జైల్లో ఉన్నారు. విడుదలయ్యాక కూడా చోరీలు చేస్తూ... జల్సాలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవలే బాలానగర్ పరిధిలోని మూడు ఇళ్లలో, కార్ఖానా పరిధిలో ఒక ఇంట్లో దొంగతనం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయగా... చోరీ చేసింది పాత నేరస్తులేనని పోలీసులు గుర్తించారు. వేలి ముద్రల ఆధారంగా అంజాద్, షారుఖ్‌లు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ పురుషోత్తం తెలిపారు. నిందితుల నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 23 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.