గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు 2020-21 కాలానికి గానూ 60,750 కోట్ల రూపాయల్ని కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2021-26 కాలానికి ఈ సంస్థలన్నిటికీ 2 లక్షల 36 వేల 805 కోట్ల రూపాయల నిధుల కేటాయింపునకు కమిషన్ ఆమోదాన్ని తెలియచేసింది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ఈ నిధుల పంపకాలు సమాంతరంగా జరగాలని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర జీఎస్డీపీలో 0.50 శాతం మేర అదనపు నిధుల్ని సమీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఐదేళ్ల కాలానికిగానూ స్థూలపన్ను ఆదాయం రూ.135.2 లక్షల కోట్ల మేర ఉంటుందని ఆర్థిక సంఘం అంచనా వేసింది.
డివిజబుల్ పూల్‌లో సెస్, సర్ఛార్జీలు తీసివేసిన అనంతరం రూ.103 లక్షల కోట్లుగా స్థూలపన్ను ఆదాయం ఉంటుందని ఆర్థిక సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. డివిజబుల్ పూల్‌లో 41 శాతం ఉన్న రాష్ట్రాల వాటా 2021-26 కాలానికి 42.2 లక్షల కోట్ల మేర ఉంటుందని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. మొత్తం గ్రాంట్లతో సహా 10.33 లక్షల కోట్లు, పన్ను ఆదాయం పంపిణీ రూ.42.2 లక్షల కోట్ల మేర చేయాల్సి ఉంటుందన్నది ఆర్థిక సంఘం అంచనా. స్థూల రాబడిలో 34 శాతం కేంద్రంలోని వనరుల అవసరాలకు, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలపై వ్యయం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం కేటాయించింది.
మెరుగైన పనితీరు కనపరిచిన రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన 12.5 శాతం మేర వెయిటేజీ కల్పించాలని ఆర్థిక సంఘం సూచించింది. పనితీరు ద్వారా ప్రోత్సాహకాలు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. మొత్తం 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్ల మంజూరుకు ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. 2 లక్షల 94 వేల 514 కోట్ల రూపాయల ఆదాయ లోటు ఉంటుందని స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని 2021-26 కాలానికి 4 లక్షల 36 వేల 361 కోట్లుగా నిర్ధారించారు. ఈ గ్రాంట్లలో మొత్తం 8 వేల కోట్లను కొత్త నగరాల ఇంక్యుబేషన్ కోసం, వాటి పనితీరు ఆధారిత గ్రాంట్లుగా ఇచ్చేందుకు కేటాయించారు.
మున్సిపల్ సేవలకు 450 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు 2 లక్షల 36 వేల 805 కోట్లు, పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థలకు లక్షా 21 వేల 55 కోట్లు, స్థానిక సంస్థల్లో ప్రజారోగ్య నిధుల కోసం 70 వేల 51 కోట్లను ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు, పట్టణాలకు మాత్రమే ప్రాథమిక నిధులు ప్రతిపాదించారు. మిలియన్ ప్లస్ నగరాల కోసం 100 శాతం గ్రాంట్లు సిటీస్ ఛాలెంజ్ ఫండ్‌కు పనితీరు ఆధారంగా అనుసంధానించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.