ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చిత్తశుద్ధి ఉంటే సలాం కుటుంబం కేసు సీబీఐకి ఇవ్వండి' - టీడీపీ లెటెస్ట్ న్యూస్

మైనారిటీలను వైకాపా ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్లు 5 నుంచి 4 శాతానికి పరిమితం చేశారని గుర్తుచేశారు. తెదేపా హయాంలోని మైనారిటీ సంక్షేమ పథకాలను తొలగించారని ఆరోపించారు. నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్యల కేసులో రిమాండ్ రిపోర్టును బలహీనంగా రూపొందించారన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Atcham naidu
Atcham naidu

By

Published : Nov 11, 2020, 11:07 PM IST

మైనారిటీలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్సార్​ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ముస్లింలకు 5 శాతం ఉన్న రిజర్వేషన్లు 4 శాతానికి పరిమితం చేశారని గుర్తుచేశారు. కడపలో మైనారిటీ అంగన్వాడి టీచర్​పై దాడి, దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా వంటి పథకాల రద్దుపై సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మైనారిటీలకు చేసిన అన్యాయాన్ని లాజిక్కులు, మ్యాజిక్కులు, కుట్రలు, కుతంత్రాలతో కప్పి పెట్టుకోవాలని చూడటం దారుణమని విమర్శించారు.

తెదేపా అధినేత చంద్రబాబు అబ్దుల్ కలాంను భారత రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తే, జగన్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వృత్తిలో భాగంగా వివిధ రకాల కేసులను వాదించే న్యాయవాదులకు రాజకీయాలు ముడిపెట్టి సొంత మీడియాలో అసత్య ప్రచారం చేయటం మైనారిటీలకు చేసే మరో అన్యాయమని ఆక్షేపించారు. సలాం ఘటనకు సంబంధించి ప్రభుత్వ రిమాండ్ రిపోర్టును అత్యంత బలహీనంగా తయారు చేసి సరైన వాదనలు వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుటుంబం ఆత్మహత్యకు కారకులైన పోలీసులపై 302 సెక్షన్ కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని అచ్చెన్న నిలదీశారు. జగన్​కు చిత్తశుద్ధి ఉంటే సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించటంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, బాధ్యులైన పోలీసులను డిస్మిస్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ...ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details