Salaries For Teachers : రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2022 వేతన సవరణ ప్రకారం స్కేళ్ల నిర్ధారణ, పే ఫిక్సేషన్ వేగంగా చేపట్టాలని ఉన్నతాధికారులు వెంటపడుతున్నారు. కొత్త పీఆర్సీని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ఆందోళనకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కొత్త వేతన ఖరారులో తొలుత ఉపాధ్యాయుల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఖజానా అధికారులకు అనధికార వర్తమానం అందింది. ఫిబ్రవరి 27లోపు రాష్ట్రంలోని అందరు ఉపాధ్యాయులు, ఉద్యోగుల కొత్త వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంతవరకు డ్రాయింగ్ డిస్బర్సుమెంట్ అధికారుల రిక్వెస్టు సైటు ఉండేది. అది ఇక పని చేయబోదని, ఇక వేతనాల బిల్లులన్నీ పేరోల్ ప్రోగ్రాంలోనే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తొలుత రాష్ట్రంలోని అందరు డ్రాయింగ్ డిస్బర్సుమెంటు అధికారులు 2022 వేతన సవరణ వివరాలను (డేటా) నిర్ధారించాల్సి ఉంటుంది. తర్వాత ఖజానా అధికారులు వాటిని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త పీఆర్సీ ఉత్తర్వులు (ప్రొసీడింగులు), సిబ్బంది పేర్లు, జీతాల బిల్లులు కనిపిస్తాయి.
*అందరు డ్రాయింగు డిస్బర్సుమెంట్ అధికారులు ఫిబ్రవరి 18లోగా వివరాలను నమోదు చేయాలి. వాటిని ఖరారుచేసి ఖజానా అధికారులకు పంపాలి.
*ఫిబ్రవరి 21నాటికి ఖజానా అధికారులు, పేఅండ్ అకౌంట్సు అధికారులు వేతనాలను ఖరారు చేయాలి.