ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీ లైవ్‌ ట్రాకింగ్‌... కొద్ది నెలలుగా నో వర్కింగ్!

ఆర్టీసీ బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు రూపొందించిన లైవ్ ట్రాకింగ్ విధానం.. కొద్ది నెలలుగా సక్రమంగా పనిచేయడంలేదు. సర్వీసుల ట్రాకింగ్ సరిగా చూపడంలేదు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Apsrtc bus live tracking
Apsrtc bus live tracking

By

Published : Dec 12, 2020, 10:16 AM IST

తాము ప్రయాణించాలనుకున్న బస్సు ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? గమ్యస్థానానికి ఏ సమయానికి చేరుకునే వీలుంటుందనే సమాచారం తెలిపే ఆర్టీసీ లైవ్‌ ట్రాకింగ్‌ యాప్‌ కొద్ది నెలలుగా సక్రమంగా పనిచేయడం లేదు. అనేక సర్వీసుల ట్రాకింగ్‌ చూపడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో ఈ యాప్‌ ద్వారా బస్సు ఎన్ని గంటలకు వస్తుందో చూసుకొని, ఆ సమయానికి బస్టాండ్‌, బస్టాప్‌నకు వెళ్లేవారు. ఇపుడు ఆ సమాచారం తెలియక.. ముందే చేరుకొని వేచి ఉండాల్సి వస్తోంది.

ఆర్టీసీ లైవ్‌ ట్రాకింగ్‌ యాప్‌ను నాలుగేళ్ల కిందట అమల్లోకి తెచ్చారు. వెహికల్‌ ట్రాకింగ్‌ యూనిట్‌ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. మూడేళ్లపాటు ఈ యాప్‌ నిర్వహణ చూసిన గుత్తేదారు సంస్థ గడువు ముగియడంతో.. గత ఏడాది చివర్లో టెండర్లు పిలిచారు. కొత్త సంస్థ గత డిసెంబరులో ఈ బాధ్యత తీసుకుంది. 11,500 బస్సులకుగాను ఈ ఏడాది మార్చి ఆరంభం నాటికి దాదాపు 9 వేల బస్సుల ట్రాకింగ్‌ ఈ యాప్‌లో క్రోడీకరించారు. తర్వాత లాక్‌డౌన్‌తో బస్సులు నిలిచిపోయాయి. దాదాపు ఆరేడు నెలలపాటు ట్రాకింగ్‌ యూనిట్‌ను పక్కనపెట్టడంతో అది పనిచేయడం మానేసింది.

రిజర్వేషన్‌ సర్వీసులకు పునరుద్ధరణ..

ప్రస్తుతం మళ్లీ ఈ యాప్‌ ద్వారా బస్సుల ట్రాకింగ్‌ను క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రమంతా రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న సర్వీసులు 2,500 ఉండగా, వాటి వివరాలు ఈ యాప్‌లో లభించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 1,400 బస్సుల ట్రాకింగ్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరు నాటికి మిగిలిన 1,100 సర్వీసుల వివరాలు కూడా చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి కల్లా బస్సుల ట్రాకింగ్‌కు సమస్యలు ఉండవని పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:

బాధితుల రక్తంలో ఆర్గానో క్లోరిన్‌, ఫాస్పరస్‌

ABOUT THE AUTHOR

...view details